ఆ మూడు పార్టీలు ఒక్కటే : విశారదన్ మహరాజ్

ఆ మూడు పార్టీలు ఒక్కటే : విశారదన్ మహరాజ్
  • రాష్ట్రంలో 15 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్నం 

ముషీరాబాద్,వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటేనని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. ఆ మూడు పార్టీలు అగ్ర కులాలకు చెందిన వారికే లోక్ సభ టికెట్లు కేటాయించారని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు 90 శాతం ఉన్న బహుజనులను మోసగిస్తూ ఓట్లను కొల్లగొడుతున్నాయని విమర్శించారు. ఓట్లును దొంగిలించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు 15 పార్లమెంట్ స్థానాల్లో ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 

బుధవారం బర్కత్ పురాలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి రావడానికి రెండు పార్టీలతో బ్యాలెన్స్ గా వెళ్తుందని విమర్శించారు. అగ్రకుల పార్టీలు గజ దొంగల పార్టీలని ఆయన ఆరోపించారు. తమ పార్టీ పోటీ చేసే 15 స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుపేద అభ్యర్థులకే సీట్లు ఇచ్చామని, మరో రెండు స్థానాల అభ్యర్థులను  రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.  

కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి  చెప్పుల గుర్తును కేటాయించిందని పేర్కొన్నారు. గ్రామస్థాయి వరకు చెప్పుల గుర్తు తీసుకెళ్లి ఓటు వేయాలని కోరుతూ అగ్రవర్ణ పార్టీల అభ్యర్థులను చెప్పులతో తరిమి కొడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో అన్నేల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.