8 మంది ప్రయాణికులకు గాయాలు.. ముగ్గురికి సీరియస్
కోల్‌కతా: విమానం ల్యాండింగ్ కు కొద్దిముందు గాల్లోనే తీవ్ర కుదుపులకు గురైంది. ఏం జరిగిందో అర్థం కాని రీతిలో తీవ్ర కుదుపులకు గురికావడంతో విమానంలోని ప్రయాణికులు చెల్లాచెదురైపోయారు. కొందరు తమ సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిందీ కోల్ కతా సమీపంలో జరిగిందీ ఘటన. తీవ్ర కుదుపులకు లోనైన విమానం 15 నిమిషాల్లో కోల్ కతా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ఈ భయంకరమైన కుదుపుల వల్ల 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
ముంబై నుంచి కోల్ కతాకు బయలుదేరిన విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన యూకే 775 విమానం ల్యాండింగ్ కు 15 నిమిషాల ముందు గాల్లోనే ఊగిపోయింది. కొద్దిసేపట్లోనే మామూలుగా కోల్ కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే విమానం కుదుపులకు పలువురు గాయపడినట్లు ఎయిర్ పోర్టు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ ను విమానం దగ్గరకు వెంటనే తీసుకొచ్చారు. గాయపడిన వారికి అక్కడికక్కడే ప్రాథమిక వైద్య చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై విమానయాన శాఖ తీవ్రంగా స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. ఒక సీనియర్ అధికారిని విధుల నుండి తప్పించింది.
