ఒక్కో ఇందిరమ్మ ఇంట్లో.. 20 నుంచి 40 ఓట్లు

ఒక్కో ఇందిరమ్మ ఇంట్లో.. 20 నుంచి 40 ఓట్లు
  • కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్​కాలనీలో పరిస్థితి
  • నాగర్​కర్నూల్​మున్సిపాలిటీ 13వ వార్డుల్లో దేశి ఇటిక్యాల ఓటర్లు 100 మంది
  • మార్పులు చేర్పులకు నో చాన్స్!

నాగర్​ కర్నూల్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు రిలీజ్​చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు బయట పడుతున్నాయి. ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డులోకి, ఒకే ఇంట్లోని ఓటర్లలో సగం మందిని మరో వార్డులోకి మార్చేశారు. కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో 40 ఏండ్ల కింద నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లలో యజమానులకు తెలియకుండా భారీ సంఖ్యలో ఓటర్లను చేర్చారు. ఓటర్ల నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన బీఎల్​వో/వార్డు ఆఫీసర్లు కళ్లు మూసుకొని అన్నింటికీ ఓకే చెప్పేశారు.

కిందిస్థాయి ఉద్యోగుల నిర్వాకం ఇట్లుంటే.. అభ్యంతరాలు స్వీకరిస్తున్న మున్సిపల్ అధికారులు ప్రస్తుత ముసాయిదా జాబితాలో వార్డులు తప్ప ఎటువంటి మార్పులు ఉండవని చెబుతున్నారు. అభ్యంతరాలుంటే తెలపాలని కలెక్టర్​వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాల విజ్ఞప్తి చేస్తుంటే మున్సిపాలిటీల్లో అటువంటిదేం ఉండదని సహాయ ఎన్నికల అధికారులు ముఖం మీదే చెప్పి పంపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నాగర్​ కర్నూల్​మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో దేశి ఇటిక్యాల గ్రామానికి చెందిన 100 మంది ఓటర్లను చేర్చారు. 23వ వార్డులో వివిధ గ్రామాలకు చెందిన 80 మంది పేర్లు నమోదు చేశారు.

ఒక్కో ఇంట్లో ఉన్నది నలుగురైదుగురే..

కల్వకుర్తి పట్టణంలోని 21వ వార్డు ఇందిరానగర్​లో 220కు పైగా ఇండ్లు ఉన్నాయి. ఒక్కో ఇంట్లో ఉండేది రెండు రూములే.  పిండిగిర్నీ నడుపుకునే రాంరెడ్డి (ఇంటి నంబర్​2-5) ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులున్నారు. ఇంటి యజమానికి తెలియకుండానే మరో 22 ఓట్లు చేరాయి. ఇదే కాలనీలో నివసించే రాజు గౌడ్( ఇంటి నంబర్​2-96, 2-97) ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే బై నంబర్లు వేసి 28 మంది కొత్త ఓటర్ల పేర్లు నమోదు చేశారు.

ఫకీరయ్యకు చెందిన ఇంటి నంబర్​ 2-104లో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉంటే అదనంగా మరో 21 ఓటర్లు నమోదయ్యారు. 2-58 నంబర్​ఇంట్లో ఏకంగా 24 మంది కొత్త ఓటర్లు చేరారు. 2-5వ నంబర్​ఇంటికి/4 వేసి ఏకంగా 43 మంది ఓటర్లను చేర్చారు. బుడగ జంగాల కుటుంబాల నుంచి 30 మందిని పేర్లను ఇదే వార్డులో కొనసాగించి, అందరి పేర్లను 2-58, 2-59 ఇంటి నంబర్లకు ట్రాన్స్​ఫర్​చేశారు. కొత్తగా నమోదైన ఓటర్ల పేర్లు, వివరాలను స్థానికులను అడిగితే.. తాము వాళ్లను చూడలేదనే సమాధానమే 
వస్తోంది.  

అధికారులు మార్చరట..

ఇందిరా నగర్​కాలనీలో ప్రభుత్వం నిర్మించిన రెండు గదుల ఇండ్లలో 20 నుంచి 28 మంది వరకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చిన అధికారులు.. సంబంధిత వివరాలను మార్చలేమని స్పష్టంగా చెబుతున్నారని యజమానులు వాపోతున్నారు. ఇంటి నంబర్​2-96 యజమాని రాజుగౌడ్​ మాట్లాడుతూ.. తమ ఇంటి నంబర్​పై బై నంబర్ల పేరుతో 26 మంది బయటి వ్యక్తులను చేర్చారన్నారు. ఈ విషయమై కల్వకుర్తి మున్సిపల్​కమిషనర్​కు ఫిర్యాదు చేస్తే.. ఇప్పుడు మార్చడం కుదరదని కసురుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి కొందరికి ఇదే అనుభవం ఎదురైనట్లు సమాచారం. గతేడాది నవంబర్​1 కంటే ముందుగా నమోదైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తీసేసే అవకాశాలు లేవని తెలిసింది.

కోర్టుకు వెళ్తాం..

యజమానులకు సమాచారం లేకుండా ఒక్కో ఇంట్లో 20 నుంచి 30 మంది ఓటర్లను ఏవిధంగా చేర్చారనే దానిపై అధికారులు చెబుతున్న వింత సమాధానాలపై ఇందిరానగర్ వాసులు మండిపడుతున్నారు. ఓటరు లిస్ట్​ తయారీలో కీలకంగా వ్యవహరించిన బీఎల్​వోలు, సిబ్బంది,  క్షేత్రస్థాయి పరిశీలన అనంతం ఏఈఆర్​వో లాగిన్​లో ఎంట్రీ చేయాల్సిన వార్డు ఆఫీసర్లు, బాధ్యులైన అధికారులను వదిలిపెట్టమని, కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.