బొద్దింకలు మన ఇళ్లలో సాధారణంగా కనిపించే ఒక పెద్ద సమస్య. వీటిని సమయానికి పట్టించుకోకపోతే చాలా వేగంగా పెరిగిపోతాయి. ఇవి సాధారణంగా చీకటిగా, తడిగా ఉండే చోట్ల దాక్కుని, రాత్రి పూట ఆహారం, నీటి కోసం బయటకు వస్తుంటాయి. బొద్దింకలు చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా, ప్రమాదకరమైన క్రిములను వ్యాప్తి చేస్తాయి, ఆహారాన్ని పాడుచేస్తాయి ఇంకా అలర్జీలకు కారణమవుతాయి....
1. వంటగదిని శుభ్రంగా ఉంచండి
బొద్దింకలు ఎక్కువగా వంటగదిలోనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాటికి తిండి ఈజీగా దొరుకుతుంది. అందుకే వంటగదిని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు శుభ్రం చేయండి. తినేసిన గిన్నెలను రాత్రంతా సింక్‌లో అలాగే వదిలేయకండి. కిరాణా సామాగ్రిని, మిగిలిపోయిన ఆహారాన్ని మూత ఉన్న దాంట్లో పెట్టండి. లీక్ అవుతున్న పైపులను, నల్లలను వెంటనే బాగు చేయించండి. నీరు లేకపోతే బొద్దింకలు బతకలేవు.
2. గోడల పగుళ్లు, రంధ్రాలు
తలుపులు, కిటికీలు, డ్రైనేజీ పైపుల పక్కన ఉండే చిన్న చిన్న సందుల గుండా బొద్దింకలు ఇంట్లోకి వస్తాయి. వంటగది, గోడల మధ్య ఉండే పగుళ్లలో ఇవి గుడ్లు పెట్టి దాక్కుంటాయి. మార్కెట్లో దొరికే 'సిలికాన్ జెల్' లేదా 'కాక్' అనే గ్లూ లాంటి పదార్థాన్ని ఉపయోగించి, పైపుల చుట్టూ ఉన్న రంధ్రాలను, గోడల సందులను పూర్తిగా పూడ్చేయండి.
3. కాక్రోచ్ జెల్స్, ట్రాప్స్
ఇంట్లో బొద్దింకలను చంపడానికి జెల్, జిగురు ప్యాడ్లు చాలా బాగా పనిచేస్తాయి. ఈ జెల్స్ నుంచి వచ్చే వాసనకు బొద్దింకలు ఆకర్షితమై, ఆ విషాన్ని తింటాయి. ఆ తర్వాత అవి గూటికి వెళ్లి చనిపోతాయి. దీనివల్ల వాటితో పాటు గూట్లోని మిగతా బొద్దింకలు కూడా అంతమవుతాయి. వీటిని సింక్ కింద, ఫ్రిజ్ వెనుక, చీకటి మూలల్లో పెట్టాలి.
4. సహజమైన చిట్కాలు
ఇంట్లోని కొన్ని వస్తువుల వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు. అయితే ఇవి బొద్దింకలను పూర్తిగా చంపలేవు కానీ, రాకుండా దూరంగా ఉంచగలవు. బిర్యానీ ఆకుల ఘాటైన వాసన బొద్దింకలకు పడదు. అందుకే వాటిని కౌంటర్లు, డ్రాయర్లలో ఉంచవచ్చు. తాజా నిమ్మకాయ తొక్కల వాసన కూడా బొద్దింకలను దూరంగా ఉంచుతుంది.
5. పెస్ట్ కంట్రోల్
మీరు ఎంత శుభ్రం చేసినా బొద్దింకలు తగ్గకుండా, రోజురోజుకూ పెరిగిపోతుంటే.. సొంత వైద్యం ఆపి పెస్ట్ కంట్రోల్ చేసే నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. వారు బొద్దింకల గూళ్లను కనిపెట్టి, కెమికల్స్ ఉపయోగించి వాటిని పూర్తిగా నిర్మూలిస్తారు.
బొద్దింకల వల్ల ఇన్ఫెక్షన్లు
దోమలలాగా బొద్దింకలు మనల్ని నేరుగా కుట్టవు. కానీ, ఇవి మురుగు కాలువలు, చెత్త కుండీలు, మరుగుదొడ్లలో తిరిగి వస్తాయి కాబట్టి, వీటి కాళ్లకు, శరీరానికి ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు అంటుకుంటాయి. ఆ తర్వాత ఇవి మన వంటగదిలో, ఆహార పదార్థాలపై తిరిగినప్పుడు ఆ క్రిములు మన తిండిలో కలుస్తాయి. పరిశోధనల ప్రకారం.. బొద్దింకల వల్ల సాల్మొనెల్లా, ఈ-కోలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయి. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, మోషన్స్, కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్లు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
