ప్రాణాలు తీస్తున్నయ్! ప్రమాదకరంగా పాత బిల్డింగ్ లు

ప్రాణాలు తీస్తున్నయ్! ప్రమాదకరంగా పాత బిల్డింగ్ లు
  •  వరంగల్ ట్రై సిటీలో వందల సంఖ్యలో ..
  • వందేండ్లు దాటినవి 291కు పైగానే..
  • నోటీసులకే  గ్రేటర్ ​అధికారులు పరిమితం
  • వర్షాలకు నాని కూలిపోతున్న  భవనాలు

“ 2022, జూన్​11న వరంగల్ చార్​ బౌలిలోని ఏరియాలో ఓ పాత భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. జులై 23న మండి బజార్​ లో బిల్డింగ్ కూలి ఇద్దరు స్పాట్​ లోనే చనిపోయారు.  ఆగస్టు13న  మండిబజార్​లోనే ఓ ఇల్లు కూలి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.  వరంగల్ ట్రై సిటీలో శిథిలాస్థకు చేరిన  పాత భవనాల కూల్చివేతలో ఆఫీసర్ల నిర్లక్ష్యం జనాల ప్రాణాలను బలిగొం  టోంది. ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోకపోవడంతో చాలా చోట్ల బిల్డింగ్​లు, ఇండ్లు కూలిపోతున్నాయి. 

ఏటా ఇదే పరిస్థితి ఉంటుండగా.. ఆఫీసర్లు మాత్రం స్పందించడంలేదనే ఆరోపణలున్నాయి. శిథిలావస్థకు చేరిన బిల్డింగ్​లను గుర్తించి కూల్చేయడం,  లేదంటే వాటికి మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా నోటీసులకే పరిమితం అవుతున్నారు.  ఆ తర్వాత వాటిని పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో జనాలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ’’

హనుమకొండ, వెలుగు : గ్రేటర్​ వరంగల్ లో పాత భవనాలు దడపుట్టిస్తున్నాయి.  వందేండ్ల కాలం దాటిన బంగ్లాలకు సరైన మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరాయి. ఇవి ప్రధానంగా మెయిన్​సెంటర్లు, రోడ్ల వెంట ఉండి భయాందోళన కలిగిస్తున్నాయి.  ఎలాంటి మరమ్మతులు చేయకుండానే మెరుగులు దిద్దించి ఓనర్లు కిరాయిలకు ఇస్తున్నారు. వానాకాలం వచ్చిందంటే అవి నానుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. రాష్ట్రంలో వరుసగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండగా..  వానకాలం సీజన్  మొదలవడంతో  పాత భవనాలు నానిపోయి కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఎప్పటిలాగే  గ్రేటర్​కార్పొరేషన్ ఆఫీసర్లు నోటీసులతో సరిపెట్టకుండా, ప్రమాదకర భవనాలను కూల్చివేసేలా చర్యలు తీసుకోవాలని సిటీ జనాలు  కోరుతున్నారు. ఏటా  పాత బిల్డింగ్ కూలి జరుగుతున్న ప్రాణ నష్టానికి ఫుల్​ స్టాప్​ పెట్టాలని వేడుకుంటున్నారు.

వందేళ్లు దాటిన భవనాలెన్నో..

​వరంగల్ ట్రై​ సిటీలో వందేళ్ల కింద  కట్టిన భవనాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వాటిని చాలావరకు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. నాలుగేండ్ల కిందట ఓల్డ్​ బిల్డింగ్​ కూలడంతో  గ్రేటర్​ఇంజినీరింగ్, టౌన్​ ప్లానింగ్ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టి మొత్తం 908 భవనాలు ప్రమాదకరంగా ఉన్నట్లు నిర్ధారించారు. మెయిన్ ​రోడ్లకు దగ్గరగా ఉండటం, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, వాటిని వెంటనే  కూల్చేయాలని ఓనర్లకు నోటీసులు కూడా ఇచ్చారు. అనంతరం వరంగల్ చౌరస్తాలో  వివాదంలోని  ఓ బిల్డింగ్​ను కార్పొరేషన్ అధికారులు పడగొట్టారు. కొంతమంది సొంతంగా కూల్చివేయించారు.  ఆ తర్వాత పాత బిల్డింగ్ ల ముచ్చట మర్చిపోయారు. అప్పుడప్పుడు ప్రమాదాలు జరిగి జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు.

మెరుగులతో సరిపెడుతూ..

ఇటీవల కార్పొరేషన్ పరిధిలో మొత్తం 291 భవనాలు  శిథిలావస్థకు చేరినట్లు ఆఫీసర్లు గుర్తించారు. వాటిలో కాలం తీరిన భవనాల పరిస్థితి  ఎలా ఉంది.. రిపేర్లు చేస్తే ఎంతకాలం మన్నికతో ఉంటాయి. లేదంటే వెంటనే  కూల్చేయాల్సిందేనా అనే అంశాలు పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించాలి. అవసరమైన వాటికి రిపేర్లు చేయించుకునేలా ఆదేశాలు ఇవ్వాలి. ప్రమాదకరంగా ఉన్నవాటి వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టించాలి. లేదంటే వెంటనే తొలగించేలా చూడాలి. 

కొంతమంది ఓనర్లు తమకు వచ్చే రెంట్లు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆఫీసర్లకు ముడుపులు ఇస్తూ మేనేజ్​ చేసుకుంటున్నారనే  ఆరోపణలు లేకపోలేదు. బిల్డింగ్​ కు రిపేర్​ చేయించుకుంటే సరిపోతుందని అధికారులు నోటీసులు ఇచ్చేస్తున్నారు.  ఫలితంగా హనుమకొండ , వరంగల్ చౌరస్తాల్లో , మండి బజార్​, బట్టల బజార్ తదితర ఏరియాల్లో  పగుళ్లు ఇచ్చిన బిల్డింగ్​లను మెరుగులు దిద్దుతున్నారు.