V6 News

షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌తో పంట చేన్లు దగ్ధం.. మూడు చెక్కలపల్లిలో ఘటన

షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌తో పంట చేన్లు దగ్ధం.. మూడు చెక్కలపల్లిలో ఘటన
  • రైతులకు రూ.20 లక్షల నష్టం

నల్లబెల్లి, వెలుగు: విద్యుత్​ షార్ట్‌‌‌‌ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న చేనులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు చెక్కలపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది గిరిజన రైతులు రెండో పంటగా మక్కజొన్న వేశారు. సోమవారం మధ్యాహ్నం గాలి దుమారం కారణంగా కరెంట్ వైర్లు ఒకదానికొకటి తాకి నిప్పులు పడి మంటలు చెలరేగాయి. మంటల్లో మొక్కజొన్న పంట చేన్లతో పాటు పోసిన కుప్పలు, తెంపిన కంకులు కాలిపోయాయి. రైతులు అక్కడికి చేరుకునే లోపే సుమారు 80 శాతం పంట మంటల్లో కాలిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు.

ఈ అగ్నిప్రమాదంలో గుగులోతు హేమ, నాగలక్ష్మి, చంద్రు, ఇస్లావతు ధర్మా, విజేందర్, రవి, ఆలు, లాలు, మహేందర్ నాయక్‌‌‌‌లకు చెందిన 16 ఎకరాల మొక్కజొన్న పంట బూడిదైంది. చేతికొచ్చిన పంట కళ్లముందే కాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.50 వేలకు పైగా అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టామని, ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోయారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల వరకు నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కవిత దేవునాయక్ కోరారు.