- ఎన్నికల బరిలో నిలిచింది 1,802
- ఊరూరా ప్రచారంలో బిజీగా అభ్యర్థులు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత సర్పంచుల బరిలో ఉండేటోళ్లు, ఏకగ్రీవాల రూపంలో పల్లెపీఠం దక్కించుకున్నోళ్లు ఎవరన్నది క్లారిటీ వచ్చింది. పంచాయతీ ఎలక్షన్లలో భాగంగా మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ల ప్రక్రియ నవంబర్ నెల 26 నుంచి ప్రారంభమైంది. స్క్రూట్నీ, ఉపసంహరణల అనంతరం బుధవారం రాత్రి ఫైనల్ బరిలో ఉండేవారేవరో అధికారులు తెలిపారు. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్‌లోని 6 జిల్లాల పరిధిలో 53 మంది ఏకగ్రీవంగా సర్పంచ్‌గిరి దక్కించుకోగా, 555 జీపీల్లో 1,802 మంది నువ్వా నేనా అన్నట్లుగా బ్యాలెట్ బరిలో ఉన్నారు.
అధికార పార్టీ మద్దతుదారుల హవా..
పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకున్నా పల్లెల్లో మాత్రం సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థి ఏ పార్టీ మద్దతుదారుడనే విషయంలో క్లారిటీ ఉంది. ఎన్నికల కమిషన్ క్యాండిడేట్లకు వివిధ గుర్తులను కేటాయించినా ఓటర్లు మాత్రం బరిలో ఉండేవారిని పార్టీ అభ్యర్థులుగానే చూస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలానే జనాలు పల్లెల అభివృద్ధి కోసం సర్పంచ్‍లను ఎన్నుకునే అంశాల్లో అధికార పార్టీ మద్దతుదారులకు ఎక్కువ ప్రియార్టీ ఇస్తున్నట్లు స్పష్టం అవుతోంది. మొదటి విడత పల్లెపోరు జరిగే 555 జీపీల్లో 1,802 మంది ఓటింగ్ కోసం వెళ్తుండగా, 53 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు అత్యధికంగా 44 చోట్ల ముందస్తు విజయం సాధించగా, బీఆర్‍ఎస్ మద్దతుదారులు 5చోట్ల, బీజేపీ 1, ఇతరులు 3చోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్ పీఠం దక్కించుకున్నారు.
జన్నపేట ఏకగ్రీవం..
ములుగు: ములుగు మండలం జగ్గన్నపేటలో సర్పంచ్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ గ్రామంలో 10 వార్డులు ఉండగా, 1737 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామస్తులంతా చర్చించుకుని అర్రెం వెంకన్నను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా తీర్మాణించారు. అదేవిధంగా మల్లంపల్లి మండలం రాంచంద్రాపురంలో కాంగ్రెస్ ప్రతినిధిగా సర్పంచ్ నామినేషన్ వేసిన దొంతి స్వరూప ప్రతాప్‌రెడ్డి ఏకగ్రీవం అయ్యారు. కాగా, మల్లంపల్లి మండలంలో మంత్రి సీతక్క కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ సపోర్టుతో సర్పంచ్ బరిలో నిలబడ్డ లడే శ్యాంరావు గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
జిల్లాల్లో సర్పంచ్ పదవికి పోటీ, ఏకగ్రీవమైన స్థానాల సంఖ్య వివరాలు..
జిల్లా జీపీలు బరిలో ఏకగ్రీవాలు కాంగ్రెస్ బీఆర్‍ఎస్ బీజేపీ ఇతరులు
వరంగల్ 91 299 11 8 2 – 1
హనుమకొండ 69 263 5 3 1 1 –
జనగామ 110 324 10 9 – – 1
భూపాలపల్లి 82 259 9 9 – – –
ములుగు 48 186 9 9 – – –
మహబూబాబాద్ 155 468 9 6 2 – 1
మొత్తం 555 1,802 53 44 5 1 3
జిల్లాల్లో వార్డులకు పోటీ, ఏకగ్రీవమైన స్థానాల సంఖ్య వివరాలు..
జిల్లా జీపీలు వార్డులు ఏకగ్రీవాలు బరిలో
వరంగల్ 91 800 214 1427
హనుమకొండ 69 658 153 1,339
జనగామ 110 1024 69 1950
భూపాలపల్లి 82 712 151 1282
ములుగు 48 420 128 287
(మరో 5 వార్డులకు నామినేషన్లు పడలేదు)
మహబూబాబాద్ 155 1338 266 2391
మొత్తం 555 4,952 981 8,676
