
- బిల్డింగ్ వాడరాదని రిపోర్ట్ ఇచ్చిన ఆర్ అండ్ బీ అధికారులు
- నిర్మించి 66 ఏండ్లు దాటడంతో పూర్తిగా శిథిలం
- గతంలోనే ప్రభుత్వానికి ప్రపోజల్స్ పెట్టిన ఆఫీసర్లు
- ఇంతవరకు ఆమోదం లభించకపోవడంతో ఇబ్బందులు
హనుమకొండ, వెలుగు: వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపిన వరంగల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్(ఐటీఐ) భవనం కూలిపోయే దశలో ఉంది. దాదాపు ఆరున్నర దశాబ్ధాల కిందట నిర్మించిన ఈ బిల్డింగ్ పూర్తిగా శిథిలావస్థకు చేరగా, ఆర్అండ్ బీ ఆఫీసర్లు ఇన్ స్పెక్షన్ చేసి దానిని ఉపయోగించడం ప్రమాదమని హెచ్చరించారు.
ప్రభుత్వం తాజాగా ఐటీఐలకు అనుసంధానంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను నిర్మిస్తున్నా, పాత ట్రేడ్ లను నిర్వహించేందుకు ఆల్టర్నేట్ భవనం లేకపోవడం, కొత్త బంగ్లా నిర్మాణానికి పంపించిన ప్రపోజల్స్ కు ఆమోదం లభించకపోవడంతో 600 మందికిపైగా విద్యార్థులు ప్రమాదకర బిల్డింగులోనే శిక్షణ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో ఎప్పుడు కూలుతుందోననే భయాందోళన వ్యక్తమవుతోంది.
డేంజర్ అని తేల్చిన ఆఫీసర్లు..
వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ బిల్డింగ్ ను 1959లో నిర్మించారు. ఇంతవరకు ఆ బిల్డింగ్ రిపేర్లకు నోచుకోక బిల్డింగ్ మొత్తం శిథిలావస్థకు చేరింది. పిల్లర్లు దెబ్బతిని ఇనుప చువ్వలు బయటకు తేలగా, స్లాబులు తరచూ పెచ్చులూడి పడుతున్నాయి. క్లాసులు, ప్రాక్టికల్స్ నిర్వహించే గదులతోపాటు టాయిలెట్స్ కూడా పూర్తిగా శిథిలమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే గతంలో ఆర్అండ్ బీ అధికారులు బిల్డింగ్ ను ఇన్ స్పెక్షన్ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రూఫ్ స్లాబ్ దెబ్బతినడంతోపాటు కిటికీలు, క్లాస్ రూంల దర్వాజలు, గోడలకు క్రాక్స్ వచ్చి బిల్డింగ్ బలహీన పడినట్లు నిర్ధారించారు. భవనం కండీషన్ బాలేదని, ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని, తరగతులను నిర్వహించవద్దని రిపోర్ట్ ఇచ్చారు.
ఆమోదం లభించలేదు..
ప్రభుత్వం ఇప్పటికే ఐటీఐల్లో ఆరు కొత్త కోర్సులతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు నిర్మిస్తోంది. కాగా, పాత బిల్డింగ్ కూలిపోయేలా ఉండటం, ఐటీఐలోని పాత ట్రేడ్లను నిర్వహించేందుకు మరో కొత్త బిల్డింగ్ అవసరం. దీంతో ఐటీఐ అధికారులు పాత ట్రేడ్ల నిర్వహణకు మరో బిల్డింగ్ కు అంచనాలు తయారు చేయించారు. ఈ మేరకు ఆర్అండ్ బీ అధికారులు జీ ప్లస్ వన్ బిల్డింగ్, వర్క్ షాప్స్, వాటర్ సప్లై, శానిటేషన్ వర్క్స్, ఎలక్ట్రిఫికేషన్, ఫర్నిచర్, ఇతర అన్ని వసతుల కల్పనకు రూ.25 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.
ఈ మేరకు ఐటీఐ అధికారులు ప్రభుత్వానికి పంపించగా, ఇంతవరకు ఆమోదం లభించలేదు. కానీ, వరంగల్ ఐటీఐలో ప్రస్తుతం ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికిల్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్, డీజిల్ మెకానిక్, వెల్డర్, కోపా ఈ తొమ్మిది ట్రేడ్లలో మొత్తంగా 600 మంది వరకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వీరంతా కూలిపోయే దశలో ఉన్న ఓల్డ్ బిల్డింగ్ లోనే బిక్కుబిక్కుమంటూ శిక్షణ పొందుతున్నారు. వందలాది మందికి ఉపాధినిచ్చిన వరంగల్ ఐటీఐకి పునరుజ్జీవం పోయాలని పూర్వ విద్యార్థులు, ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.