మల్లన్న గండి కుడికాల్వ నుంచి నీటి విడుదల

మల్లన్న గండి కుడికాల్వ నుంచి నీటి విడుదల

స్టేషన్ ఘన్‌పూర్, వెలుగు : మల్లన్న గండి రిజర్వాయర్​ కుడి కాల్వ నుంచి బుధవారం వరంగల్​ ఎంపీ కడియం కావ్య, స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నీటి విడుదల ఓ చారిత్రాత్మక ఘట్టమని, దీని ద్వారా రైతుల పంటలకు జీవం పోసినట్లు ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.29 కోట్లతో నిర్మించిన మల్లన్నగండి రిజర్వాయర్​ కుడి కాల్వ ద్వారా 5,600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు. దేవాదుల 3దశ 6వ ప్యాకేజీ ద్వారా 4 నియోజకవర్గాల్లో 78వేల ఎకరాలకు సాగు నీరందిచవచ్చని, ఇందుకోసం నిధుల మంజూరుకు సీఎం రేవంత్​రెడ్డి ఆమోదం తెలిపారని చెప్పారు.

 ఏడాదిలోపు ప్యాకేజీ 6 పనులు పూర్తి చేస్తామన్నారు. గండి రామారం నుంచి చిల్పూర్, వేలేరు మండలాలకు సాగునీరు అందించేందుకు 104తో లిఫ్ట్ పనులు జరుగుతున్నాయని, మూడు నెలల్లో పనులు పూర్తి అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్యా శిరీష్ రెడ్డి, చిల్పూర్ గుట్ట దేవస్థాన పొట్లపల్లి శ్రీధర్ రావు, ఆర్డీవో డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  

బాధిత కుటుంబానికి పరామర్శ

ధర్మసాగర్ : మండల కేంద్రమైన ధర్మసాగర్ కు చెందిన కాంగ్రెస్​ సీనియర్ నాయకులు, మాజీ టీపీసీసీ సభ్యులు గంగారపు అమృతరావు తండ్రి గంగారపు ఆదాము బుధవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడియం ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.