హనుమకొండ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం సృష్టించడం ఎందుకని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలిపితే చేసిన పాపాలు తొలగిపోతాయా అని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతల నిరసనలపై సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ నేతలంతా చేసేవన్నీ తప్పులు., వాటికి ఉద్యమం అనే పేర్లు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవితనే పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు తప్పు చేశారని చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నారు.
కేసీఆర్ కు అంత నిజాయితీ ఉంటే విచారణకు సహకరించాలన్నారు. గతంలో విచారణల్లేకుండా ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి జైళ్లకు పంపినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. నిరసనలు చేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావన్నారు. బీఆర్ఎస్ నేతల కపట వేషాలను తెలంగాణ ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
