వేసవిలో తాగునీటికి ఢోకా లేదు : వాటర్​ బోర్డు

వేసవిలో తాగునీటికి ఢోకా లేదు  : వాటర్​ బోర్డు
  • జలాశయాల్లో సరిపడానీటి నిల్వలున్నాయ్

హైదరాబాద్, వెలుగు: ఈ వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాటర్​బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన రిలీజ్​చేశారు. సిటీకి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. నాగార్జుసాగర్ ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో, నగర వాసులకు నీటి తిప్పలు తప్పవంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సాగర్​నుంచి రోజూ 270 ఎంజీడీల నీరు సిటీకి వస్తోందని, మంగళవారం నాటికి నాగార్జునసాగర్ వాటర్​లెవల్138.73 టీఎంసీలుగా ఉందని, 514.10 అడుగుల మేర నీరు ఉందని చెప్పారు.

గతేడాది ఇదే రోజున 187.07 టీఎంసీలు, 539.40 అడుగుల నీరు ఉందని తెలిపారు. ప్రస్తుతం డెడ్ స్టోరేజీ లెవల్ కంటే ఎక్కువ నీరు ఉందని, వేసవిలో సిటీకి తాగునీటి కొరత ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. జులై నెలాఖరు వరకు ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాట్ల పనులు పూర్తయినట్టు చెప్పారు. జలాశయం నీటి మట్టం 510 అడుగులకు చేరగానే, ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా సిటీకి నీటిని సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు ఎల్లంపల్లి జలాశయంలో డెడ్ స్టోరేజీ నుంచి అత్యవసర పంపింగ్ చేయడానికి అవసరమైన ప్రక్రియ మొదలు పెట్టినట్టు తెలిపారు. అవసరాన్ని బట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి అదనపు జలాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.