వార్డు పాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తం

వార్డు పాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌లో ప్రజల వద్దకే మున్సిపల్ ఆఫీస్​ను తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వార్డు పాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని.. ఇది వస్తే ప్రజలు సర్కిల్ ఆఫీసులు, జోనల్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. తమ వార్డులో ఉండే వార్డు ఆఫీసులోనే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. దీనికి సంబంధించి అధికారులు రూపొందించిన ప్రణాళికపై కేటీఆర్ బుధవారం సెక్రటేరియట్‌‌లో రివ్యూ చేశారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేందుకు ఈ కొత్త వ్యవస్థను తెస్తున్నామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వార్డు ఆఫీసుల్లో  దాదాపు పది మంది అధికారులు ఉంటారని తెలిపారు.‘‘వార్డు పరిపాలనా వ్యవస్థకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్ చార్జ్​గా ఉంటారు. ఈయనకు అనుబంధంగా పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్వహణ, ఎంటమాలజీ విభాగం, వెటర్నరీ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం, జలమండలి వంటి తదితర విభాగాలకు సంబంధించిన 8 నుంచి 10 మంది అధికారులు పనిచేస్తారు. వీరు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుతో పాటు ప్రజలకు ఉన్న ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి  చేస్తారు" అని కేటీఆర్ వివరించారు. ఈ వార్డు పాలన వ్యవస్థను మే నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని, సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 

స్వీడన్ రాయబారితో  కేటీఆర్ భేటీ

ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణే అనువుగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌లో స్వీడన్ నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలు, స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్‌‌‌‌ తదితరులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టెక్నాలజీ, తయారీ రంగాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలని కోరారు. పెట్టుబడులను తెలంగాణకు రప్పించేందుకు ప్రయత్నిస్తానని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ హామీ ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. దేశంలోకి వచ్చే కంపెనీలతో కలిసి పనిచేసేందుకు తాము ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.