డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుంటే.. కిడ్నాపర్లు కనిపించారు

డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుంటే.. కిడ్నాపర్లు కనిపించారు
  • ఫుల్లుగా మద్యం తాగి ఉన్న నిందితులు
  • హైదరాబాద్ ఎల్బీ నగర్ టింబర్ డిపో వ్యాపారి కిడ్నాప్ కేసులో కిడ్నాపర్లుగా గుర్తింపు
  • అప్పటికే వీరి చెర నుంచి తప్పించుకుని ఇంటికి ఫోన్ చేసిన వ్యాపారి

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్న పోలీసులకు ఊహించని రీతిలో కిడ్నాపర్లు కనిపించారు. ఫుల్లుగా మద్యం సేవించి కారులో వెళ్తున్న వారిని అనుమానంతో సోదా చేయగా కిడ్నాపర్లుగా తేలడంతో పోలీసులు షాక్ గురయ్యారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉన్న టింబర్ డిపో వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో వీరు ప్రధాన నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. 
అప్పటికే వారి చెర నుంచి తప్పించుకున్న వ్యాపారి
కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ముందే వారి చెర నుంచి ఎల్బీనగర్ టింబర్ డిపో వ్యాపారి మహమ్మద్ ఆరిఫ్ తప్పించుకున్నారు. తన సమీప బంధువుల పనే అయి ఉంటుందని ఆయన అనుమానించడానికి తోడు పోలీసులు ఈయన కోసం గాలింపు చేపట్టడంతో కిడ్నాపర్లు భయపడిపోయారు. ఆయనను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే కిడ్నాపర్లు హడావుడిలో పడిపోవడంతో అవకాశం చూసుకుని టింబర్ డిపో వ్యాపారి వారి చెర నుంచి తప్పించుకుని పరారయ్యారు. నాగపూర్ పట్ణానికి చేరుకుని తన ఇంటికి ఫోన్ చేశారు. తాను కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నానని.. క్షేమంగా నే ఉన్నానని.. నాగపూర్ నుంచి మాట్లాడుతున్నానని తెలియజేశాడు. 
ఆర్ధిక లావాదేవీలే కిడ్నాప్ కు కారణం: రాచకొండ సీపీ 
ఎల్బీనగర్ డింబర్ డిపో వ్యాపారి మహ్మద్ ఆరిఫ్ అక్బర్ ను  కిడ్నాప్ చేసిన కేసులో ఏడుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేసినట్లు ఎల్బీ నగర్ పోలీసులు ప్రకటించారు. ఆర్ధిక లావాదేవీలే కిడ్నాఫ్ కు కారణమని పోలీసులు తేల్చారు. కిడ్నాఫ్ పాల్పడ్డ  ప్రధాన నిందితుడు బాధితుడికి దగ్గరి బందువేనని స్పష్టం చేశారు. కిడ్నాపర్లు టింబర్ డిపోలోకి ప్రవేశించిన వెంటనే సీసీ కెమెరాల ఆపేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని.. అయితే పోలీసు దర్యాప్తు ప్రారంభం అయ్యిందని.. తమపై అనుమానంతో ప్రశ్నిస్తున్నారని తెలియగానే నిందితులు బాధితున్ని వదిలేయాలని డిసైడ్ అయ్యారు. నాగ్ పూర్ హైవేపై డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ చేస్తున్న పోలీసులకు కిడ్నాప్ కేసులో నిందితులు కనిపించారు. ఇన్నోవా కారులో ఉన్న ఏడుగురు ఫుల్లుగా మద్యం సేవించి ఉండడం గుర్తించారు. వారిని సోదా చేస్తుండగా.. కిడ్నాప్ కేసులో నిందితులని తేలింది. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాఫ్ జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కిడ్నాపర్ల ఇండ్లు,వ్యాపార స్థలాలను గుర్తించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. అరెస్టు చేసిన ఏడుగురు కిడ్నాప్ కేసు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.