V6 News

లిక్కర్ స్కామ్.. జడ్జి పై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు.. ఎవరీ జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ?

లిక్కర్ స్కామ్.. జడ్జి పై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు.. ఎవరీ జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ?

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మపై చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ మద్యం పాలసీ  కేసులో తనపై జరుగుతున్న విచారణను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ బెంచ్ నుండి వేరే కోర్టుకు మార్చాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఆమె గతంలో RSS అనుబంధ సంస్థ అయిన 'అఖిల్ భారతీయ అధివక్త పరిషత్' నిర్వహించిన కార్యక్రమాలకు నాలుగుసార్లు హాజరయ్యారని, దీనివల్ల తనకు నిష్పక్షపాతంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని కేజ్రీవాల్ వాదించారు.

జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఎవరు?
ఆమె ఢిల్లీ హైకోర్టులో ఒక కీలకమైన న్యాయమూర్తి. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు. 1991లో లా (LLB), 2004లో మాస్టర్స్ (LLM) పూర్తి చేశారు. మేనేజ్‌మెంట్ అండ్ అడ్వర్టైజింగ్‌, పబ్లిక్ రిలేషన్స్‌లో కూడా ఆమెకు డిప్లొమా ఉంది. చాలా చిన్న వయసులోనే (24 ఏళ్లకు) మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టారు. 35 ఏళ్లకే సెషన్స్ జడ్జి అయ్యారు. మార్చి 28, 2022న ఢిల్లీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

►ALSO READ | నోయిడాలో ఆగని ఆందోళనలు.. 45 వేల మంది కార్మికులు రోడ్లపైనే.. దేశవ్యాప్త ఉద్యమానికి దారి తీస్తుందా..?

 కోర్టు కేసులను పరిష్కరించే మెడియేషన్ (మధ్యవర్తిత్వం) ప్రక్రియలో ఆమె నిపుణురాలు. ఢిల్లీలోని వివిధ కోర్టుల్లో మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే కమిటీలకు ఆమె అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె ఇప్పటివరకు 5 పుస్తకాలు రాశారు.

తన కేసును ఈమె బెంచ్ నుండి తప్పించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది అంటే తీర్పును తర్వాత వెల్లడిస్తుంది. కాగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజ్రీవాల్ అభ్యర్థనను తిరస్కరించడంతో ఈ విషయంలో అయన  సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.

తనకు పక్షపాతం లేని విచారణ కావాలని, ఒక నిర్దిష్ట భావజాలం ఉన్న సంస్థల కార్యక్రమాలకు హాజరైన న్యాయమూర్తి తన కేసును విచారించడం సరికాదని కేజ్రీవాల్ కోర్టులో గట్టిగా వాదించారు.