ఇండియాలో మళ్ళీ నిపా వైరస్ కలకలం.. కొత్తగా రెండు కేసులు.. WHO కీలక నిర్ణయం!

ఇండియాలో మళ్ళీ నిపా వైరస్ కలకలం.. కొత్తగా రెండు కేసులు..  WHO కీలక నిర్ణయం!

భారతదేశంలో రెండు నిపా వైరస్ కేసులు బయటపడటంతో  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. దీనివల్ల పెద్దగా ప్రమాదమేమీ లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

భారత్‌లో నిపా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రయాణాలపై కానీ, వ్యాపారాలపై కానీ ఎలాంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని WHO చెప్పింది.

ఈ రెండు కేసులు పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో మాత్రమే కనిపించాయి. అయితే ఈ రోగులు ఎక్కడికీ ప్రయాణించలేదు, కాబట్టి  ఇతర రాష్ట్రాలకు లేదా ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు. అంతేకాకూండా ఈ వైరస్ ఒక మనిషి నుంచి ఇంకొకరికి వేగంగా వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.

 నిపా వైరస్ అంటే ఏమిటి :
 నిపా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వచ్చే వైరస్. కలుషితమైన ఆహారం తినడం వల్ల లేదా వైరస్ ఉన్న వ్యక్తులతో అతి దగ్గరగా ఉండటం వల్ల  వస్తుంది. ఈ వైరస్ సోకితే జ్వరం రావడంతో పాటు మెదడు వాపు  వచ్చే అవకాశం ఉంది.

నిపా వైరస్  లక్షణాలు :
మొదట్లో  జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వస్తాయి. తరువాత పరిస్థితి తీవ్రమైతే మెదడుపై ప్రభావం చూపి శ్వాస సమస్యలు వస్తాయి. చివరికి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

నిపా వైరస్  చికిత్స :
ప్రస్తుతానికి నిపా వైరస్‌కు ప్రత్యేకమైన టీకాలు లేదా మందులు లేవు. అయితే, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో పాటు పలువురు నిపుణులు దీని కోసం వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.