రాహుల్ ఛాతీలో బుల్లెట్లు దించుతం..ఏబీవీపీ కేరళ లీడర్ కామెంట్స్

రాహుల్ ఛాతీలో బుల్లెట్లు దించుతం..ఏబీవీపీ కేరళ లీడర్ కామెంట్స్
  • బంగ్లాదేశ్, నేపాల్ లాంటి అల్లర్లు ఇక్కడ జరగవని వెల్లడి​
  • ఖండించిన కాంగ్రెస్ నేతలు
  • అమిత్​షాకు లేఖ రాసిన కేసీ వేణుగోపాల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఏబీవీపీ కేరళ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రింటు మహదేవ్ చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. బంగ్లాదేశ్, నేపాల్​లో నెలకొన్న పరిస్థితులు ఇండియాలోనూ రిపీట్ కావాలనే కోరికలు ఏమైనా రాహుల్ గాంధీకి ఉంటే.. వెంటనే అతని ఛాతీలో బుల్లెట్లు దించుతామంటూ ప్రింటు మహదేవ్ హెచ్చరించాడు. 

బంగ్లాదేశ్, నేపాల్​లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ఈ నెల 26న న్యూస్ 18 అనే మలయాళం టీవీ ఛానెల్​లో డిబేట్ జరిగింది. అందులో ప్రింటు మహదేవ్ పాల్గొని రాహుల్​ను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్లు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

‘‘దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బలంగా మద్దతు ఇస్తున్నారు. ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్​లో హింస చెలరేగింది. ప్రభుత్వాలు కూలిపోయాయి. అలాంటి పరిస్థితి ఇండియాకు రాదు. బంగ్లాదేశ్ ప్రొటెస్టర్లు, నేపాల్ జెన్​ జెడ్ నిరసనల గురించి రాహుల్ గాంధీ కలలు కంటున్నారేమో.. అలాంటి పరిస్థితి ఇండియాలోనూ రావాలని కోరుకుంటున్నారేమో.. అది జరగని పని. హింసను ప్రోత్సహించాలనుకుంటే మాత్రం రాహుల్ ఛాతిలో బుల్లెట్లు దించుతాం’’అని ప్రింటు మహదేవ్ హెచ్చరించాడు.

కామెంట్లను ఖండించిన కాంగ్రెస్​

మహదేవ్ చేసిన కామెంట్లను కాంగ్రెస్ నేతలంతా ఖండించారు. లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని చంపేస్తామని బహిరంగంగా హెచ్చరిస్తుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏంచేస్తున్నాయని నిలదీశారు. రాహుల్ తల్లి ఇందిరా, తండ్రి రాజీవ్ హత్యకు గురయ్యారని, ఇప్పుడు కొందరు రాహుల్​ను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏబీవీపీ మాజీ నేత ప్రింటు మహదేవ్ నుంచి రాహుల్​కు ప్రాణహాని ఉందన్నారు. ప్రింటు మహదేవ్​పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.