కొండగట్టు ఆలయానికి నిధులివ్వడంపై కోర్టుకెళ్తా : కేఏ పాల్

కొండగట్టు ఆలయానికి నిధులివ్వడంపై కోర్టుకెళ్తా : కేఏ పాల్

కోర్టులు మొట్టికాయలు వేసినా కేసీఆర్ మారడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. కేసీఆర్ రూ.600 కోట్ల ప్రజల సొమ్మును కొండగట్టు ఆలయానికి ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ అజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నాడన్న పాల్... తన కూతురు కవితను అరెస్ట్ నుంచి తప్పించేందుకే ఇదంతా చేస్తున్నారా అని నిలదీశారు. కేసీఆర్ ఆర్ఎస్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నాడని, కేసీఆర్ బీజేపీ బీ టీమ్ అని మరోసారి నిరూపించుకుంటున్నాడని విమర్శించారు. ఆ కారణంగానే కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కావడం లేదని అన్నారు. తాను సెక్యులర్ అని చెప్పుకుంటున్న కేసీఆర్ చర్చిలకు, మసీదులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని ప్రభుత్వ భూములు అమ్మి, దాని ద్వారా వచ్చిన నిధులను ఒకటి, రెండు దేవాలయాలకు ఖర్చు పెడుతున్నాడని పాల్ మండిపడ్డారు.

కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రజలు ఈ విషయంపై కేసీఆర్ ను ప్రశ్నించాలని సూచించారు. డబ్బుల కోసం కమ్యూనిస్టులు కేసీఆర్ దగ్గరకే కాదు ఎక్కడికైనా వెళతారన్న ఆయన.. ఏప్రిల్ 14వ తేదీన తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ఒప్పుకున్నందునే శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ ల ముట్టడి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాను నిజమైన హిందువునన్న పాల్... హిందువుగానే చనిపోతాను... కాని ఏసుక్రీస్తును ఫాలో అవుతానని కామెంట్ చేశారు.