తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ లో బుధవారం ( నవంబర్ 12) రాత్రి అత్యంత కనిష్ఠంగా 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్ శేరిలింగంపల్లి హెచ్‌సీయూ ప్రాంతంలో 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో సగటున 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణో గ్రతలు పడిపోయాయని తెలిపారు. ఈ నెలలో సగటు ఉష్ణోగ్రతలు ఈరోజు (నవంబర్ 13) 13 నుంచి 17 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందన్నారు. రాబోయే వారం రోజులు ఇదే తరహా చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆదిలాబాద్, కొమురం భీం- ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, భూపాలపల్లి, రంగారెడ్డి, యాదాద్రి- భువనగిరి, పటాన్‌చెరు, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ శివారు హయత్‌నగర్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు.
పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠం గా 26 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నా.. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం అత్యల్పానికి పడిపోతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 16 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు స్వెట్టర్లు ధరించాలని.. చెవుల్లోకి.. ముక్కులోకి శీతల గాలి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
