మాస్క్​లతో 30లక్షలు.. ఈ డిజైన్‌‌లకు సెలబ్రిటీలు ఫిదా

మాస్క్​లతో 30లక్షలు.. ఈ డిజైన్‌‌లకు సెలబ్రిటీలు ఫిదా

నారాయణ పేట, వెలుగు: కరోనా చాలామంది జీవితాలను ఆగంజేసింది. పోయిన ఏడాది లాక్‌‌డౌన్‌‌ టైంల చానామందికి పనిదొరకలే. రోజువారీ కూలీలకు పనిలేక, జీతాలు రాక మస్త్‌‌ ఇబ్బందులు పడ్డరు. అట్లాంటి టైంల నారాయణపేటకు చెందిన ఆడోళ్లు మాత్రం చానా పైసలు సంపాదించిన్రు. కలెక్టరమ్మ ఇచ్చిన ఐడియాతో మాస్క్‌‌లు కుట్టిన్రు. వాటిని అమ్మి 30 లక్షల రూపాయలు సంపాదించిన్రు. సినిమా హీరోలు, బాలీవుడ్‌‌ తారలు కూడా వాళ్ల మాస్క్‌‌లు కొన్నరు.  

కరోనా నుంచి మనల్ని కాపాడుకోవాలంటే మాస్కే దిక్కయ్యింది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్‌‌ పెట్టుకోవాలని సర్కార్‌‌‌‌ చెప్పింది. దీంతో చాలాచోట్ల ఒక్కసారిగా మాస్క్‌‌లకు డిమాండ్‌‌ పెరిగిపోయింది. మరోవైపు లాక్‌‌డౌన్‌‌ కావడంతో పనులు లేక మహిళాసంఘాల సభ్యులు ఖాళీగా ఉన్నారు. వాళ్లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నారాయణపేట కలెక్టర్‌‌‌‌ హరిచందన మాస్క్‌‌లు తయారుచేయించి, వాళ్లకు ఉపాధి కల్పించింది. డీఆర్‌‌‌‌డీఓ ప్లాన్​తో, ఆర్థిక సాయం చేసి వాళ్లతో ఆ పని మొదలుపెట్టించింది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో రకరకాల మాస్క్‌‌లు తయారుచేసి మహిళలు రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఆరు లక్షల మాస్క్‌‌లు కుట్టి 30 లక్షల రూపాయలు సంపాదించిన్రు. క్లాత్‌‌ మాస్క్‌‌లు, ఆయుర్వేద మాస్క్‌‌లు, స్కార్ఫ్‌‌ మాస్క్‌‌లు కుట్టి వాటిని ఆన్‌‌లైన్‌‌లో అమ్ముతున్నారు. అలా బాలీవుడ్‌‌ సెలబ్రిటీలు టబూ, ఫరాఖాన్‌‌ కూడా ఆన్‌‌లైన్‌‌లో వాటిని కొనుక్కున్నరు. హీరో విజయ్‌‌ దేవరకొండ కూడా ఈ మాస్క్‌‌లు నచ్చి రౌడీ బ్రాండ్‌‌ వెబ్‌‌సైట్‌‌లో బ్రాండింగ్‌‌ చేశాడు.    

ఆయుర్వేద మాస్క్​ స్పెషల్‌‌
నారాయణపేట చేనేతకు ప్రసిద్ధి. దీంతో రకరకాల, రంగురంగుల మాస్క్‌‌లు కుట్టడం మొదలుపెట్టారు. క్లాత్‌‌ మాస్క్‌‌లను మళ్లీ మళ్లీ ఉతికి వాడుకునే వెసులుబాటు ఉండటంతో చాలామంది వీటిని  కొన్నారు. ఆ డిమాండ్‌‌తోనే కొత్త కొత్త మాస్క్‌‌లు తయారు చేశారు. అలా ఆయుర్వేద మాస్క్‌‌ను కూడా తయారుచేశారు. మహిళలు కుట్టిన మాస్క్‌‌లను ఆయుర్వేద డాక్టర్లకు పంపుతారు. వాళ్లు కర్పూరం, వాము, పుదీనా, నీలగిరి ఆకు, లవంగ నూనెలు కలిపి తయారు చేసిన ఒక మిశ్రమంలో ముంచి వాటిని ఆరబెడతారు. అలా ఆయుర్వేద మాస్క్‌‌లు తయారవుతాయి. మాస్క్‌‌ కొనేటప్పుడే ఆ లిక్విడ్‌‌ను కూడా ఇస్తారు. మాస్క్‌‌ ఉతికిన తర్వాత ఆ లిక్విడ్‌‌లో ముంచి ఆరేసుకోవచ్చు. ఈ ఆయుర్వేద మాస్క్‌‌లు వాడటం వల్ల దగ్గు, జలుబు, ఉబ్బసం లాంటి సమస్యలు కూడా రావని చెప్తున్నారు డాక్టర్లు. లాక్‌‌డౌన్‌‌ తర్వాత ఉపాధి పనులు మొదలైనప్పుడు పనులకు వచ్చేవారికి మాస్క్‌‌లు పంచాలని అధికారులకు ఆదేశాలు అందాయి. డీఆర్‌‌‌‌డీఓ అధికారులు నారాయణపేట మహిళలు కుట్టిన మాస్క్‌‌లే పంచారు.  దీంతో జిల్లావ్యాప్తంగా ఆ మాస్క్‌‌లకు మస్తు డిమాండ్‌‌ ఏర్పడింది.

 సరికొత్త డిజైన్లతో..
ఎన్‌‌95 మాస్క్‌‌ల కొరత, వాటిని కొన్ని రోజులు మాత్రమే వాడే పరిస్థితి ఉండటంతో అందరి దృష్టి క్లాత్‌‌ మాస్క్‌‌లపైకి మళ్లింది. దీంతో ఆ మాస్క్‌‌లకు ఉన్న డిమాండ్‌‌ను చూసిన మహిళలు కొత్త కొత్త డిజైన్లను తయారు చేశారు. పోచంపల్లి కాటన్​, రంగు రంగుల క్లాత్‌‌ల​తో సరికొత్త డిజైన్​లు కుట్టారు. అంతేకాకుండా అమ్మాయిలకు స్కార్ఫ్‌‌ మాస్క్‌‌లు కూడా రెడీ చేశారు. కరోనా టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా పొల్యూషన్‌‌ నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా దాన్ని తయారుచేశారు. ‘పేట’ బ్రాండ్‌‌ పేరుతో వాటిని మార్కెటింగ్‌‌ చేసుకున్నారు.

ఆన్​లైన్‌‌లో​ ఆర్డర్స్
మహిళలు కుట్టిన మాస్క్‌‌లను కేవలం నారాయణ పేటకే పరిమితం చేయకుండా సోషల్‌‌ మీడియా సాయంతో దేశమంతా తెలిసేలా చేశారు. ఆన్‌‌లైన్‌‌ మార్కెటింగ్‌‌ మొదట్లో కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెట్టినా తర్వాత క్లిక్‌‌ అయ్యింది. దీంతో ఇప్పుడు నారాయణపేట మాస్క్‌‌లకు బాగా పేరొచ్చింది. హైదరాబాద్​ మెట్రోరైలు, ఫిక్కీ, రాంకీ లాంటి సంస్థలు కూడా మాస్క్​లు ఆర్డర్​ చేశాయి. డెలాయిట్​ కంపెనీ వీరి నుంచి 63 వేల మాస్క్​లు కొన్నది. 

కలెక్టర్​ ప్రోత్సాహంతోనే...
జిల్లా కలెక్టర్​ హరిచందన ప్రోత్సాహంతోనే నారాయణపేటలో కుట్టిన మాస్క్‌‌లకు మంచి పేరు వచ్చింది. మహిళలను కష్టకాలంలో ఆదుకోవా లనే ఆలోచన, ప్రజలకు అవసరమైన మాస్క్‌‌​లను అందించాలనే తపన, మహిళా సంఘాల పట్టుదలతో ముందుకెళ్తున్నాం. మాస్క్​లు కావాల్సిన వారు 91212 36009, 8790990606 లలో సంప్రదించవచ్చు.
- కాళిందిని , డీఆర్‌‌‌‌డీవో, ప్రాజెక్ట్‌‌ డైరెక్టర్‌‌‌‌

ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి...
కరోనా కష్టకాలంలో మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలి అనుకున్నాం. అలాగే డబ్బు కూడా వచ్చేలా చేద్దాం అనుకున్నాం. అప్పుడు వచ్చిందే ఈ మాస్క్‌‌ల ఐడియా. మాస్క్‌‌లు తయారుచేయడంతో పాటు మార్కెటింగ్​పై కూడా వారికే అవగాహన కల్పించాం. ఇప్పుడు వాళ్లు  లాభాలు పొందుతున్నారు. వీటితో పాటు మహిళల కోసం చాలా ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.  మహిళలకు మరింత ప్రోత్సాహం ఇస్తాం.
- హరిచందన, నారాయణపేట జిల్లా కలెక్టర్

చేతినిండా పని దొరికింది
లాక్​డౌన్‌‌ టైంలో పనిలేక ఇబ్బందులు పడ్డాం. అలాంటప్పుడే మాస్క్‌‌ల తయారీ మొదలుపెట్టాం. దాంతో చేతినిండా పని దొరికింది. అధికారుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. ఇప్పుడు కొత్త కొత్త డిజైన్లు చేస్తున్నాం.  
- రాజేశ్వరి, మక్తల్​ మండల సమాఖ్య అధ్యక్షురాలు