
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ బెంగళూరు సిటీ ట్రాఫిక్ చూస్తే బయటికి వెళ్లాలంటేనే దడ పుట్టిస్తుంది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి రెడ్డిట్ ద్వారా ఆ నగరంలో రోజురోజుకి దిగజారుతున్న మౌలిక సదుపాయాలపై తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేసారు. అతను చేసిన "Blr Infra కూలిపోతోంది" అనే పోస్ట్ రద్దీ లేని సమయాల్లో కూడా ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలను ఇంకా రోడ్డు పరిస్థితులను ఎత్తిచూపింది.
గత 10 సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటున్న ఒకతను ఇందిరానగర్ నుండి మాన్యత టెక్ పార్క్ వరకు వెళ్ళడానికి దాదాపు రెండు గంటలు పట్టిందని వివరించారు. అదికూడా ఆఫీసు సమయాల్లో కాదు, రాత్రి 3:30 గంటలకు. అయితే ఈ రెండు ప్రదేశాల మధ్య డ్రైవింగ్ దూరం దాదాపు ఆరు కిలోమీటర్లు. అతను చేసిన పోస్ట్ ప్రకారం చూస్తే "నేను గత 10 సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటున్నాను, నేను చూసిన వాటిల్లో ఇది అత్యంత దారుణమైన పరిస్థితి" అంటూ పోస్ట్ చేసారు.
అంతేకాక ట్రాఫిక్ సమస్య సరిపోదన్నట్లుగా ఎలిమెంట్స్ మాల్ ముందు ఒక బీమ్ కూలిపోయిందని పేర్కొన్నారు. దీనివల్ల ఉదయం 5:40 గంటల సమయంలో రోడ్డుపై పెద్ద ఎత్తున అడ్డంకులు ఏర్పడ్డాయి. అలాగే రోడ్డుపై పగిలిన గాజు ముక్కలను చూస్తే ఎదో కారు దెబ్బతిని ఉండవచ్చని తెలిపారు. అయితే ఈ సంఘటనపై ఇంకా ఎలాంటీ అధికారిక సమాచారం రాలేదు.
ALSO READ : మీ దగ్గర రూ.23 లక్షలు ఉంటే చాలు.. గోల్డెన్ వీసాతో దుబాయ్‌లో హ్యాపీగా సెటిల్ అవ్వొచ్చు
బెంగుళూరు నగరంలో కూలిపోయే స్థాయికి చేరుకున్న మౌలిక సదుపాయాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరారు. గత కొంతకాలంగా చూస్తే ట్రాఫిక్ ఇంకా భద్రతా సమస్యలు పెరుగుతున్న కొద్దీ బెంగుళూరు వాసులు సోషల్ మీడియాలో తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కానీ అతను చేసిన రెడ్డిట్ పోస్టుకు దాదాపు 900 లైక్స్, వందకు పైగా కామెంట్లు వచ్చాయి.