ఢిల్లీ వ‌ర‌ద‌లు: మునిగిన‌ రాజ్ ఘాట్.. సుప్రీంకోర్టు చుట్టూ నీళ్లు

ఢిల్లీ వ‌ర‌ద‌లు:  మునిగిన‌ రాజ్ ఘాట్.. సుప్రీంకోర్టు చుట్టూ నీళ్లు

గరిష్ఠ స్థాయికి చేరుకున్న యమునా నది నీటిమట్టాలు మెల్లగా తగ్గుముఖం పట్టినా.. ఢిల్లీలోని పలు ప్రాంతాలు మాత్రం జలమయంలోనే ఉన్నాయి. యమునా నది ఉప్పొంగి దేశ రాజధానిని ముంచెత్తడంతో ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, శ్మశానవాటికలను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా మూసివేసింది.

ఉదయం 6 గంటలకు యమునా నీటి మట్టాలు 208.46 మీటర్లకు చేరాయి, ఇది నిన్న రాత్రి 208.66 కంటే కొంచెం తక్కువగా ఉంది. ఈరోజు నీటి మట్టాలు తగ్గుతాయని, మధ్యాహ్నం ఒంటి గంటకు 208.30 మీటర్లకు చేరుకోవచ్చని కేంద్ర జల సంఘం అంచనా వేసింది.

This breach is causing flooding of ITO and surroundings. Engineers have been working whole nite. I have directed the Chief Secretary to seek help of Army/NDRF but this shud be fixed urgently https://t.co/O8R1lLAWXX

— Arvind Kejriwal (@ArvindKejriwal) July 14, 2023

యమునా జలాలు ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాలను కూడా చుట్టేశాయి. అందులో భాగంగా సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి రాజ్‌ఘాట్‌ను  కూడా ముంచెత్తాయి. కాగా దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఢిల్లీ అధికారులు తెలిపారు.

వరదలపై ఆరా..

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి.. ఢిల్లీలోని వరదల పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం. వరదల పరిస్థితిని గురించి ప్రధాని మోదీకి వివరించిన ఆయన.. రాబోయే 24 గంటల్లో యమునాలో నీటి మట్టం తగ్గుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలను ఆదివారం వరకు మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఇప్పటికే ఆదేశించింది.