బెంగుళూర్: పిల్లలు పుట్టడం లేదని భార్యను గొంతు నులిమి హత్య చేశాడు భర్త. ఆ తర్వాత గుండె పోటుతో చనిపోయిందని నమ్మించే ప్రయ్నతం చేశాడు. అనుమానం వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఇంటరాగేషన్లో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. వివరాల ప్రకారం.. బెళగావి జిల్లాలోని బైల్‌హోంగల్ తాలూకా నేగిన్హాల్ గ్రామానికి చెందిన రాజేశ్వరి, ఫకీరప్ప గిలక్కన్వర్ భార్యభర్తలు.
వీరికి పదేళ్ల క్రితం వివాహమైంది. కానీ ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. ఎన్ని ఆసుపత్రులు తిరిగిన సంతానం కలగలేదు. దీంతో ఫకీరప్ప భార్యపై కోపం పెంచుకున్నాడు. భార్య అనారోగ్య సమస్యల వల్లే పిల్లలు పుట్టడం లేదని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే శక్రవారం (జనవరి 23) భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. గుండె పోటుతో చనిపోయిందని బంధువులకు సమాచారం అందించాడు. బంధువులంతా ఇంటికి చేరుకోగానే వెంటనే భార్య అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుబడ్డాడు.
►ALSO READ | వేరే మతం యువకుడిని ప్రేమించిందని బిడ్డను కొట్టి చంపిర్రు.. యువకుడిని కూడా వదల్లేదు..!
అలాగే తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఏడుస్తున్నట్లు నటించాడు. అయితే.. అంత్యక్రియలు నిర్వహిస్తుండగా రాజేశ్వరి మెడపై గాయాలు ఉన్నట్లు బంధువులు గుర్తించారు. మరోవైపు ఫకీరప్ప ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి తరలించారు. పోస్ట్ మార్టంలో రాజేశ్వర్ గుండె పోటుతో కాదు.. ఊపిరి ఆడక చనిపోయిందని తెలింది.
దీంతో పోలీసులు ఫకీరప్పను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించగా భయంకర నిజం బయటపడింది. భార్యకు పిల్లలు పుట్టడం లేదని కోపంతో తానే గొంతు నులిమి హత్య చేసినట్లు ఫకీరప్ప పోలీసులు ఎదుట నేరం అంగీకరించాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫకీరప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
