పేదరికం వెక్కిరించినా వెనకడుగేయలేదు

పేదరికం వెక్కిరించినా వెనకడుగేయలేదు

ఏడేండ్ల కిందట ఫుడ్​ ప్రాసెసింగ్​కి సంబంధించిన ఓ వర్క్​షాప్​కి వెళ్లిందామె. ఆ ఇన్​స్పిరేషన్​తో సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంది. ఆ ఆలోచనల్ని పేదరికం వెక్కిరించింది. నీ వల్ల కాని పనంటూ సవాలు చేసింది.అలాగని ఊరుకోలేదామె..చేతిలో ఉన్న ఐదొందలతోనే మొదలుపెట్టింది. ఇప్పుడు ‘షిరిన్’​ పేరుతో 35 ఫుడ్​ ప్రొడక్ట్స్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. రీసెంట్​గా అస్సాం విమెన్​ ఎంట్రప్రెనూర్​ అవార్డు అందుకున్న ఈమె​  పేరు

యాంగ్​మిలా జిమిక్​. 

మణిపూర్​లోని ఫరూంగ్​ అనే ఓ చిన్న కొండ ప్రాంతంలో పుట్టింది యాంగ్​మిలా.  మూడేండ్ల వయసులోనే తల్లి ప్రేమకి దూరమైంది. తండ్రి మరో పెండ్లి చేసుకున్నాడు. తనకి తోడు ఆరుగురు పిల్లలున్న వాళ్ల కుటుంబంలో మూడు పూటలా తినడమే పెద్ద విషయం. ఆ పరిస్థితుల వల్ల చదువుకి దూరమైందామె. చిన్న వయసులోనే పెండ్లి చేసుకుని పక్కనే ఉన్న ఉఖ్రుల్​ జిల్లాకి వచ్చేసింది. కష్టాలు తీరతాయనుకుంటే.. కొడుకు పుట్టిన కొన్నేండ్లకే  భర్త దూరమయ్యాడు. దాంతో కొడుకు బాధ్యతంతా ఆమె భుజాలపై పడింది. చిన్నా చితకా పనులు చేస్తూ కొడుకు ఆలనాపాలనా చూసుకుంది యాంగ్​మిలా. ఏడేండ్ల కిందట ఒక వర్క్​ షాపుకి వెళ్లడం ఆమె ఎంట్రప్రెనూర్​ జర్నీకి బాట వేసింది. 

ఉసిరి, చక్కెర కొని..

మణిపూర్​కి చెందిన ఓ ఎన్జీవో ఫుడ్​ ప్రాసెసింగ్​కి సంబంధించి ఉఖ్రూన్​లో ట్రైనింగ్​ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొన్నాక.. వ్యాపారం చేయాలన్న ఆలోచన మొదలైంది. అయితే లక్షల్లో పెట్టుబడి పెట్టే స్థోమత లేకపోవడంతో.. తక్కువ ఇన్వెస్ట్​మెంట్​తో చేయగలిగే బిజినెస్​ల గురించి ఆలోచించింది. అప్పుడొచ్చిందే క్యాండీ ఐడియా.  మార్కెట్​లో తాను సస్టైన్​ అవ్వగలనో లేదో తెలుసుకోవడానికి  శాంపిల్​గా కొన్ని క్యాండీలు తయారుచేసి

ఫ్రెండ్స్​ని, బంధువుల్ని 

రుచి చూడమంది. అందరూ చెప్పిన మాట ఇంకొన్ని కావాలని. ఆ ఎంకరేజ్​మెంట్​తో ​ తన దగ్గరున్న ఐదొందలతో... ఉసిరికాయలు, చక్కెర కొని మరికొన్ని క్యాండీలు తయారుచేసింది. వాటిని దగ్గర్లోని కిరాణా షాపులకి సప్లయ్​ చేసింది. ఆశ్చర్యంగా రెండుమూడు రోజుల్లోనే తను పంపిన స్టాక్​ అంతా సేల్​ అయిపోయింది.  ఇంకాస్త సరుకు పంపమని చాలా కిరాణా షాపుల నుంచి ఫోన్లు వచ్చాయి. దాంతో బిజినెస్​ని​ మరింత సీరియస్​గా తీసుకుంది.. జామ, ఆల్ బుఖార, ఆలివ్​ పండ్లతో కూడా క్యాండీలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత జామ్​లని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. పికిల్ మేకింగ్​ వర్క్​ షాప్​ ద్వారా పచ్చళ్ల తయారీ స్టార్ట్​ చేసింది. 

చేతులే మెషిన్​

క్యాండీలు, జామ్​లు, పచ్చళ్లతో పాటు కేక్​, స్క్వాష్, వివిధ ఫ్లేవర్స్​ గ్రీన్​ టీలు..ఇలా  మొత్తం కలుపుకొని 35 రకాల ప్రొడక్ట్స్​ తయారుచేస్తోంది యాంగ్​మిలా. అయితే వీటి తయారీకి ఎలాంటి మెషినరీ వాడదామె. ప్రత్యేకంగా తయారీ యూనిట్​ కూడా లేదు. ఇంట్లోనే అది కూడా ఫ్రూట్స్​తోనే ఈ ప్రొడక్ట్స్​ అన్నీ తయారుచేస్తుంది. వాటిని చుట్టుపక్కలున్న యాభై స్టోర్స్​లో అందుబాటులో ఉంచుతోంది. తన ఫేస్​బుక్​ పేజీలోనూ  వీటిని​ అమ్ముతోంది. త్వరలో అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ లాంటి ఆన్​లైన్​ స్టోర్స్​లోనూ తన ప్రొడక్ట్స్​ని తీసుకురానుంది. రీసెంట్​గా ఒక జర్మన్​ నాన్​ ప్రాఫిట్​ ఆర్గనైజేషన్​ యాంగ్​మిలా కంపెనీకి 12 లక్షల ఫండ్స్​ ఇచ్చింది. అలాగే అస్సాం ప్రభుత్వం రూరల్​ కేటగిరీలో విమెన్​ 
ఎంట్రప్రెనూర్​ అవార్డు ఇచ్చి సత్కరించింది.