పనిచేస్తున్న షాప్‌‌లోనే చోరీ.. యువతి అరెస్ట్‌‌

పనిచేస్తున్న షాప్‌‌లోనే చోరీ.. యువతి అరెస్ట్‌‌

కోదాడ, వెలుగు : పనిచేస్తున్న షాప్‌‌లో ఆభరణాలు, నగదు చోరీ చేసిన ఓ యువతిని సోమవారం కోదాడ పట్టణ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కోదాడ సీఐ నరసింహారావు, ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... కోదాడ పట్టణంలో సుమతి హాస్పిటల్‌‌ పక్కన బట్టల షాప్‌‌ నిర్వహించే చక్రపాణి అదే బిల్డింగ్‌‌లో పైన ఉంటున్నాడు. ఇక్కడే ఉన్న పూజగదిలోని లాకర్‌‌లో నగలు, డబ్బులను భద్రపరిచాడు. చక్రపాణి ఇటీవల టీచర్స్‌‌ కాలనీలో ఇల్లు నిర్మించుకొని అక్కడికి మారినప్పటికీ, షాపు వద్ద పూజగది లాకర్‌‌ను ఇక్కడే ఉంచాడు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌‌ బాలాపూర్‌‌కు చెందిన గౌసియా బేగం చక్రపాణి వద్ద పనికి కుదిరింది. ఆమె నమ్మకంగా పనిచేయడంతో పూజ గదిలోకి సైతం అనుమతి ఇచ్చారు. ఇక్కడ భారీగా నగదు, బంగారం ఉండడాన్ని గమినించిన ఆమె సమయం చూసుకొని చోరీ చేసింది. ఈ క్రమంలో గత నెల 29న చక్రపాణి ఫ్యామిలీ మెంబర్స్‌‌ తీర్థయాత్రలకు వెళ్లేందుకు లాకర్ తెరువగా అందులోని డబ్బు, బంగారం కనిపించలేదు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టణ సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో గౌసియా బేగం ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించి రామిరెడ్డిపాలెంలో ఉంటున్న ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే చోరీ చేసినట్లు ఒప్పుకుంది. ఆమె వద్ద నుంచి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకొని, ఆమెను అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించారు.