గోదావరినదిలో కొట్టుకుపోయిన ప్రేమ జంట

గోదావరినదిలో కొట్టుకుపోయిన ప్రేమ జంట
  • యువతి మృతి, యువకుడిని కాపాడిన జాలర్లు
  • పెండ్లికి వారం రోజుల ముందు విషాదం

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరినది బ్రిడ్జి వద్ద స్నానం చేసేందుకు వెళ్లిన ప్రేమ జంట నదిలో కొట్టుకుపోయింది. నీట మునిగి యువతి చనిపోగా, యువకుడిని జాలర్లు కాపాడారు. పెండ్లికి వారం రోజుల ముందు ఈ ఘటన జరగడం విషాదాన్ని నింపింది. గోదావరిఖని విఠల్​నగర్​కు చెందిన దానవేన మల్లేశ్​ కొడుకు రవితేజ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. రెండేండ్ల కింద పెద్దపల్లి సమీపంలోని పెద్ద బొంకూరు గ్రామానికి చెందిన మౌనిక(17)తో ఇన్​స్ట్రాగ్రామ్​లో రవితేజకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు ప్రేమించుకుంటున్నారు. నెలన్నర కింద మౌనిక విఠల్​నగర్​లోని రవితేజ ఇంటికి చేరుకుంది.

నవంబర్​ 1న వీరు పెండ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోగా, వీరి పెండ్లికి రవితేజ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఈక్రమంలో గోదావరినది స్నానం చేసేందుకు కుటుంబ సభ్యులంతా ఆదివారం బ్రిడ్జి సమీపంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద ఉన్న పుష్కర ఘాట్​కు వెళ్లారు. రవితేజ, మౌనిక పుష్కరఘాట్​ వద్ద స్నానం చేస్తుండగా, మౌనిక జారి కొట్టుకుపోయింది. ఆమెను కాపాడేందుకు రవితేజ కూడా ఆమె వెంటే వెళ్లాడు. 

కానీ, ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో కొట్టుకుపోతుండగా, పక్కనే చేపలు పడుతున్న జాలరి నాగుల రాములు రవితేజను కాపాడాడు. మౌనికను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆమె చనిపోయింది. కులాలు వేరైనా తల్లిదండ్రులను ఒప్పించి మౌనికను పెండ్లి చేసుకోవడానికి అవసరమైన సామగ్రి తెచ్చుకున్నామంటూ రవితేజ కన్నీరుమున్నీరయ్యాడు. గోదావరిఖని టూ టౌన్​ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.