
- జల్సాల కోసం యువతి చోరీలు
- డబ్బులతో గోవా, ముంబైల్లో చిల్
- ఇప్పటివరకు మూడు దొంగతనాలు
- తాజాగా ఆల్విన్‌కాలనీలో 22 తులాల బంగారం చోరీ
- కేసు మిస్టరీ ఛేదించిన బాలానగర్ పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట పరిధిలో ఈ నెల18న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ దొంగతనం ఓ యువతి చేసిందని తెలుసుకుని అవాక్కయ్యారు. వివరాలను బాలానగర్ డీసీపీ సురేశ్కుమార్శుక్రవారం వెల్లడించారు. ఆల్విన్‌కాలనీకి చెందిన వి.చిరంజీవి ప్రైవేట్‌జాబ్ చేస్తుంటాడు. ఈ నెల18న తన పిల్లలను స్కూల్లో డ్రాప్చేయడానికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి తాళం చెవిని చెప్పుల స్టాండ్‌లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. గంట సేపటికి వచ్చి చూడగా, తాళం తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లగా 22.3 తులాల బంగారం, ఐదు తులాల వెండి మాయం కావడంతో జగద్గిరిగుట్ట పోలీసుకు ఫిర్యాదు చేశాడు.
సీసీ కెమెరాలో బయటపడ్డ గుట్టు
ఈ చోరీ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఓ యువతి దొంగతనం చేసిందని గుర్తించారు. యూపీకి చెందిన బేబి అలియాస్ఆరోహి(21) బతుకుదెరువు కోసం వచ్చి సనత్‌నగర్‌లోని మధునగర్‌లో ఉంటోంది. ఇంటింటికీ తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అమ్ముతుంటుంది. ఈమెకు లగ్జరీ లైఫ్అంటే ఇష్టం. గోవా, ముంబైతో పాటు దేశంలోని మేజర్సిటీస్కు వెళ్లి లైఫ్‌ను నచ్చినట్టు ఎంజాయ్చేయాలనే ఆశ. ఈమె చేస్తున్న పనితో ఎక్కువ డబ్బులు రాకపోవడంతో లైఫ్‌ను తాను అనుకున్నట్టు మల్చుకోవడానికి దొంగతనాలు ఒక్కటే మార్గమని డిసైడ్అయ్యింది.
సైకాలజీ కనిపెట్టింది..
చాలా మంది ఇండ్లకు తాళం వేసి వెళ్లేవారు తాళం చెవులను ఎక్కువగా షూ ర్యాక్స్, పూలకుండీలు, బకెట్స్, తలుపులపైన పెడతారని తెలుసుకుంది. కొన్ని నెలల కింద బోరబండ పోలీస్‌స్టేషన్‌లో ఇలాగే రెండు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చింది. డబ్బులన్నీ అయిపోవడంతో మళ్లీ ఈనెల 18న ఆల్విన్‌కాలనీకి వెళ్లింది. అక్కడ చిరంజీవి ఇంటికి తాళం వేసి ఉండడంతో టార్గెట్చేసింది. ముందు ఇంటి ముందున్న షూర్యాక్వెతికింది.
అనుకున్నట్టే తాళం చెవి కనపబడడంతో దర్జాగా తాళం తీసి ఇంట్లోకి వెళ్లింది. తర్వాత బీరువాను బ్రేక్‌చేసి అందులోని బంగారం, వెండి అంతా ఊడ్చుకెళ్లింది. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా ఆరోహి సంగతి బయటపడింది. ఆమెను అరెస్ట్ చేసి 22.3తులాల బంగారం, 5 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కి తరలించారు. కేసును చాకచక్యంగా చేధించిన జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ, డీఐ నరేందర్‌రెడ్డి, సీసీఎస్ సీఐ రవి, ఇతర సిబ్బందిని డీసీపీ అభినందించారు.