
అదిరిపోయేలా కామెడీ చేస్తుంది. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తుంది. ప్రమోషన్స్ కూడా తనదైన స్టైల్లో డిఫరెంట్‌గా చేస్తుంది. అందుకే తక్కువ టైంలోనే యూట్యూబ్‌లో సక్సెస్ అయింది కుషా కపిల. ఇప్పుడు ఆమె ఫేమస్ ఇంటర్నెట్ సెన్సేషన్. ఇంగ్లిష్ లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసి యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ గురించి...
కుషా కపిలకు చదువుకునే రోజుల్లోనే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ వల్లే యూట్యూబ్‌లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్19, 1989న నార్త్ ఢిల్లీలో పుట్టింది కుష. సౌత్ ఢిల్లీలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధంగా నడుస్తున్న ఇంద్రప్రస్థ కాలేజీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుంది. తర్వాత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. ఈ కాలేజీలో చదువుతున్నప్పుడే ఒక థియేటర్ గ్రూపులో చేరింది. అదే టైంలో జర్నలిస్టు కావాలని కూడా అనుకుంది ఆమె. కానీ.. కుదరలేదు. చివరికి యూట్యూబర్‌గా సెటిల్ అయింది. ప్రస్తుతం కొన్ని వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తోంది కూడా.
యూట్యూబ్‌లోకి ఇలా...
యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతోనే అక్టోబర్ 7, 2011న యూట్యూబ్‌లోకి అడుగుపెట్టింది కుష. ఛానెల్ పేరు కూడా తన పేరుతోనే ‘కుషా కపిల’ అని పెట్టుకుంది. అయితే.. వీడియోలు మాత్రం మూడేండ్ల నుంచి అప్లోడ్ చేస్తోంది. మొదటగా ట్రావెల్ వ్లాగ్ అప్లోడ్ చేసింది. తర్వాత షార్ట్ కామెడీ వీడియోలు చేసింది. కానీ.. వాటికి అంతగా రీచ్ రాలేదు. సబ్స్క్రయిబర్ల సంఖ్య కూడా పెరగలేదు. తర్వాత కొన్నాళ్లకు వరుసగా వ్యూస్ పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆమె ఛానెల్‌కు 8లక్షల 68 వేల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 232 వీడియోలు అప్లోడ్ చేసింది. ఇప్పుడు ఎక్కువగా షార్ట్ వీడియోలే పోస్ట్ చేస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే రీల్స్‌కు అయితే.. విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెను ఇన్‌స్టాలో 31 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు ఆమె 2,300కు పైగా పోస్ట్‌లు పెట్టింది. ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, షాహిద్ కపూర్‌లాంటి బాలీవుడ్ యాక్టర్స్‌తో కలిసి రీల్స్ చేసింది.
యూట్యూబ్‌కి ముందు
యూట్యూబ్‌లోకి రాకముందు కుష చాలా చోట్ల పనిచేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ చేశాక ఢిల్లీలోని ఒ కంపెనీలో మూడు నెలల పాటు మర్చండైజింగ్ ఇంటర్న్‌గా పనిచేసింది. తర్వాత నోయిడాలోని చిసెల్ ఎఫెక్ట్స్‌లో ప్రొడక్ట్ డిజైన్ ఇంటర్న్‌గా చేసింది. 2013లో అపెరల్ ఆన్‌లైన్ బట్టల కంపెనీకి ఫ్యాషన్ కరస్పాండెంట్‌గా చేసింది. 2014లో రేజర్‌ఫిష్ నీవ్‌లో చేరి కాపీ రైటర్‌గా కొత్త జర్నీ మొదలుపెట్టింది. అదే సంవత్సరంలో అబిష్ మాథ్యూ హోస్ట్ చేసిన టెలివిజన్ షో ‘సన్నాఫ్ అబిష్’తో స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 2016లో టైమ్స్ ఇంటర్నెట్‌లో ఫ్యాషన్ ఎడిటర్‌గా పనిచేసింది. కొన్నాళ్ల నుంచి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతూనే ‘ఐడివా’ అనే ఎంటర్టైన్మెంట్ కంపెనీలో కంటెంట్ రైటర్ హెడ్‌గా పనిచేస్తోంది. అదే కంపెనీ నడుపుతున్న యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన కొన్ని వీడియోల్లో ‘బిల్లి మాసి’ అనే ఫిక్షనల్ క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ సక్సెస్‌తో జనాలకు బాగా చేరువైంది. తర్వాత 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఘోస్ట్ స్టోరీస్’ సినిమాలో కనిపించింది. అమెజాన్ ప్రైమ్‌లో 2021లో వచ్చిన కామెడీ రియాలిటీ షో ‘ఎల్ఓఎల్: హస్సే తో ఫేస్సే’లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2022లో అమెజాన్ మినీ టీవీలో వచ్చిన రియాలిటీ స్కెచ్ కామెడీ షోలో కూడా నటించింది. నెట్‌ఫ్లిక్స్ టీవీ సిరీస్ ‘మసాబా సీజన్ 2’లో లీడ్ రోల్ చేసింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ అవకాశాలు దక్కించుకుంటూ.. యూట్యూబ్‌లో కూడా రాణిస్తోంది. ప్రస్తుతం ‘ఐడివా’ కోసం బాలీవుడ్ సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేస్తోంది. అంతేకాదు.. కరణ్ జోహార్, సోనమ్ కపూర్, కరీనా కపూర్ లాంటివాళ్లతో కలిసి పనిచేసింది.
సంపాదన
కుషాకు యూట్యూబ్‌తోపాటు ఇంకా చాలా ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఇన్‌స్టా, యూట్యూబ్‌ల్లో బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంటుంది. ఓలే, మింత్రా, లేస్, బయోటిక్, నైకా, మాస్టర్‌కార్డ్ లాంటి కంపెనీలకు కూడా పనిచేసి డబ్బు సంపాదిస్తోంది. ప్రస్తుతానికి ఆమె ఆస్తుల విలువ దాదాపు 25 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. యూట్యూబ్, ప్రమోషన్స్ ద్వారానే నెలకు 2.5 లక్షలకు పైగా సంపాదిస్తోంది. ఇదేకాకుండా మిగతా సంపాదన ఏడాదికి 45 లక్షలపైనే ఉంటుంది.
డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్
అందమైన అమ్మాయిలు, ఇన్ఫ్లుయెన్సర్ల ఫొటోలతో సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేయడం.. వాటిని ఉపయోగించి అమాయకులతో చాటింగ్ చేసి, డబ్బులు గుంజడం కేటుగాళ్లకు కామన్ అయిపోయింది. అలాగే కుషా కపిల ఫొటోలతో ‘బంబుల్’ అనే డేటింగ్ యాప్‌లో ‘సన్నా’ అనే పేరుతో ఈ మధ్య ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దాంతో ఆ అకౌంట్ ఆమెదే అని చాలామంది నమ్మారు. చివరికి ఆ విషయం కుషాకు తెలియడంతో ఆ అకౌంట్ స్క్రీన్ షాట్‌ని ట్విట్టర్లో షేర్ చేస్తూ.. అది తనది కాదని చెప్పింది.