
బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రపంచంలో మోస్ట్ కామన్క్యాన్సర్. ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి కచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటోంది. ప్రస్తుతం అవేర్నెస్ కల్పించడం వల్ల కేసుల్ని తగ్గించగలుగుతున్నాం అంటున్నారు డాక్టర్లు. 1990లలో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రతి ఏటా అక్టోబర్ను బ్రెస్ట్ క్యాన్సర్అవేర్నెస్ నెలగా గుర్తించాలని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువ అయిపోతున్నాయని, అందరిలో అవగాహన తీసుకువచ్చేందుకు ఏడాదిలో ఒక నెలంతా కేటాయించాలని చెప్పారు. తద్వారా ముందస్తుగానే క్యాన్సర్ని కనుక్కుని ట్రీట్మెంట్ ఇస్తే.. ఎన్నో జీవితాలను కాపాడొచ్చు అనేది దీని వెనుక ఉన్న ఉద్దేశం. ఈ అవేర్నెస్లో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్గురించి డాక్టర్ ఆజాద్ చంద్రశేఖర్ ఏమన్నారంటే..
రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అంటే.. ఒక్క కారణం అని చెప్పలేం. అనేక రకమైన కారణాల వల్ల ఈ రిస్క్ పెరుగుతుంది. ఒక స్టడీ ప్రకారం జన్యుపరంగా రావొచ్చు. ఒబెసిటీ, కొన్నేండ్లుగా స్మోకింగ్ చేస్తుండడం వల్ల రావొచ్చు. హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీలో ఐదు లేదా పదేండ్లకు పైగా టాబ్లెట్స్ వాడడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. దీంతో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి ఒక నెల తర్వాత రిజల్ట్ లేదంటే ఆ టాబ్లెట్స్ వాడకూడదు. ఈ విషయాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు.
అలాగే కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్వంటి కేసుల్లో ట్రీట్మెంట్లో భాగంగా బ్రెస్ట్ రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు రేడియేషన్ ఎఫెక్ట్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతుంది. అన్నింటికన్నా ప్రమాదకరమైనది, ఇండియాలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నది ఇడియోపథిక్ క్యాన్సర్. దీన్నే అన్నోన్ కాజ్ అంటారు. అంటే వీళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వచ్చిందనే కారణం తెలియదు. ఇలా క్యాన్సర్‌కు కారణం ఏదైనా కావొచ్చు కానీ వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది.
లక్షణాలు మారుతూ..
బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి దశలో.. రొమ్ములో నొప్పిలేని గడ్డ ఉంటుంది. బ్రెస్ట్లో ఉన్న గడ్డ పరిమాణం పెరిగి, ఇతర భాగాలకు వ్యాపిస్తే నొప్పి వస్తుంది. పెరిగిన గడ్డ చర్మానికి వ్యాపిస్తుంది. తద్వారా అల్సర్‌గా అంటే మానని పుండుగా మారుతుంది. అలాగే చనుమొన నుంచి రక్తస్రావం, చర్మం అంతా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంటుంది. కొన్నిసందర్భాల్లో బ్రెస్ట్ గట్టిగా మారిపోతుంది. రొమ్ముతోపాటు చంకల్లో, మెడ భాగంలో గడ్డలు ఉన్నా క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి. అడ్వాన్స్డ్ స్టేజీల్లో లక్షణాలు ఇలా ఉంటాయి.. రొమ్ము క్యాన్సర్ ఎముకలకు వ్యాపించినప్పుడు ఒళ్లు నొప్పులు వస్తాయి. లివర్‌కు వ్యాపిస్తే జాండిస్ వస్తుంది. ఊపిరితిత్తులకు స్ప్రెడ్ అయితే ఆయాసం వస్తుంది.
గుర్తించలేక..
మామూలుగా మెనుస్ట్రువల్టైంలో బ్రెస్ట్ బిగుతుగా మారుతుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ టైంలో బ్రెస్ట్లో గడ్డల్లాగా వచ్చి పోతుంటాయి. అలాంటివే అనుకుని మనదేశంలో చాలామంది క్యాన్సర్ గడ్డను గుర్తించలేకపోతారు. అందువల్ల మనదగ్గర పేషెంట్లు దాదాపు మూడు, నాలుగు స్టేజీల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వస్తున్నారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది.. మనదేశంలో మహిళలు తమ అవయవాల్లో ఏ సమస్య ఉన్నా అంత ఈజీగా బయటికి చెప్పరు. మరీముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ విషయంలో చాలా రహస్యంగా ఉంటారు. మహిళలు తమ సమస్యల్ని చెప్పకపోవడం వల్ల రోగం ముదురుతుంది. అందుకే ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లను లేటుగా గుర్తిస్తున్నారు. అందువల్ల చనిపోయే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
టెస్ట్లు చేయించుకుంటే..
లక్షణాలు కనిపిస్తే.. వెంటనే మామోగ్రామ్ టెస్ట్ తప్పనిసరిగా చేస్తారు. ఇందులో ప్రస్తుతం అడ్వాన్స్డ్, మోడర్న్ టెక్నిక్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎర్లీ స్టేజీలోనే క్యాన్సర్‌ను కనిపెట్టొచ్చు. తర్వాత బైరాయిడ్ స్కోరింగ్ ఇస్తారు. అందులో1,2 ఉంటే అబ్జర్వేషన్లో ఉంచుతారు. స్కోర్ 3లో ఉంటే క్యాన్సర్ ఉండొచ్చు లేకపోవచ్చు. 4,5,6 లో ఉంటే క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది. అలాంటప్పుడు ఏ రకమైన గడ్డ అనేది తెలుసుకునేందుకు బయాప్సీ టెస్ట్ చేస్తారు.
వీటి తర్వాత ఎన్నో దశలో ఉంది అనేది తెలియడానికి ఇమేజింగ్ స్కాన్ (పీఈటీ స్కాన్) అంటే బాడీ మొత్తం స్కాన్ చేస్తారు. తద్వారా ఏ భాగంలో గడ్డ ఉందో డాక్టర్‌కు తెలుస్తుంది. అయితే గడ్డ చిన్నగా ఉంటే గుర్తించడం చాలా కష్టం అవుతుంది. గడ్డ పరిమాణం పెద్దగా ఉన్నప్పుడే డాక్టర్ దాన్ని క్యాన్సర్‌గా డిక్లేర్ చేస్తారు. రొమ్ములో ఒకటే గడ్డ ఉందా లేదా ఎక్కువ ఉన్నాయా? అనేది చూస్తారు. తర్వాత చంక, మెడ భాగాలకు ఏమైనా వ్యాపించిందా? లివర్, లంగ్స్, బ్రెయిన్, ఎముకలకుగానీ వ్యాపించిందా? అనేది టెస్ట్ చేస్తారు. క్యాన్సర్ ఏ భాగానికి స్ప్రెడ్ అయిందనేదాన్ని బట్టి దశలు నిర్ణయిస్తారు.
మంచి-చెడు
ట్రీట్మెంట్లోనూ రకరకాల దశలు ఉన్నాయి. అవన్నీ ఒక్కో పేషెంట్‌కు అవసరం కావొచ్చు, కాకపోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజీలో అంటే రొమ్ములో మాత్రమే ఉంటే ఆపరేషన్ చేస్తే సరిపోతుంది. అయితే గడ్డ ఒక సెంటీమీటర్ కంటే ఎక్కువ పరిమాణంలో ఉంటే కచ్చితంగా కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది. బ్రెస్ట్ కన్జర్వేటరీ సర్జరీ చేసినవాళ్లకు రేడియోథెరపీ తప్పనిసరి. బ్రెస్ట్ మాస్టెక్టమీ చేస్తే చంకల్లో స్ర్పెడ్ అయినప్పుడు మాత్రమే రేడియోథెరపీ చేస్తారు. అంతేకాకుండా బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఈఆర్/పీఆర్ పాజిటివ్ అని రిపోర్ట్ వస్తే.. మంచి క్యాన్సర్ అని అర్థం. ఇది ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. అదే ఈఆర్/పీఆర్ నెగెటివ్ వస్తే చెడు క్యాన్సర్ అంటారు. అది ట్రీట్మెంట్కి తగ్గిపోయినా మళ్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది.
పోలిక వద్దు
చాలామంది క్యాన్సర్ పేషెంట్లు ఇతర రోగులతో కంపేర్ చేసుకుంటారు. దాంతో కీమోథెరపీ తీసుకోవడం వల్ల ఒక పేషెంట్ డెత్ అయిందని, తాము తీసుకోవడానికి భయపడతారు. కానీ ఒక్కో పేషెంట్ జర్నీ ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు.. పెండ్లయిన పాతికేండ్ల అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. కొన్నాళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాక డబ్బులు అయిపోయాయి. దీంతో ఇక ట్రీట్మెంట్ ఆపేయాలి అనుకున్నారు. కానీ ఒక నాయకుడి చొరవతో ఆ కేసు మా దగ్గరకొచ్చింది. ఆమెకి కౌన్సెలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడంతో రికవరీ అయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది. కాబట్టి రికవరీ అయిన పేషెంట్లను చూసి వాళ్లలా తాము కూడా తిరిగి కోలుకుంటారని ఆశతో ఉండాలి.
డాక్టర్లు కూడా ముందుగానే కౌన్సెలింగ్ ఇస్తారు. ఏ ట్రీట్మెంట్లో అయినా కంపారిజన్ ఉండకూడదు. అంతెందుకు అసలు లైఫ్‌లో ఎవరితోనూ పోల్చుకోవడం సరికాదు. చివరిగా.. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. 40 ఏండ్లు దాటిన ప్రతి మహిళ 70 ఏండ్ల వరకు ఏటా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. 40 ఏండ్ల కంటే చిన్న వయసు వాళ్లలో హార్మోనల్ చేంజెస్ వల్ల రొమ్ములో వచ్చే గడ్డలు నొప్పిగా ఉంటాయి. కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్లైనా ముందుగా టెస్ట్లు చేయించుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
డా. యు. ఆజాద్ చంద్రశేఖర్
మెడికల్ డైరెక్టర్ & సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్
డిడిహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్, హైదరాబాద్