V6 News

SIP Mistakes: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఈ 10 తప్పులు చేస్తున్నారా..? లాభాలు కష్టమే..!

SIP Mistakes: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఈ 10 తప్పులు చేస్తున్నారా..? లాభాలు కష్టమే..!

మ్యూచువల్ ఫండ్లలో SIP రూలంపో పెట్టుబడి అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు అయిపోవచ్చు అనే మాట నిజమే. అయితే ఆ ప్రయాణంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనల్ని లక్ష్యానికి దూరం చేస్తుంటాయని చాలా మంది ఇన్వెస్టర్లకు అస్సలు తెలియదు. చాలా మంది ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఎస్‌ఐపీలు మొదలుపెట్టి.. మధ్యలో కొన్ని తప్పులు చేసి చేతులు కాల్చుకుంటారు. మీరు కూడా ఆ జాబితాలో ఉండకూడదంటే.. చేయకూడని 10 తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకోండి.. 

ఎస్‌ఐపీ ఇన్వెస్టర్లు అస్సలు చేయకూడని 10 తప్పులు ఇవే:

1. మార్కెట్ పడిపోగానే ఎస్‌ఐపీ ఆపేయడం:
మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది భయపడి ఎస్‌ఐపీలు ఆపేస్తారు. నిజానికి మార్కెట్ పడిపోయినప్పుడే ఎక్కువ యూనిట్లు తక్కువ ధరకు వస్తాయి. అప్పుడే ఇన్వెస్ట్ చేస్తేనే కాంపౌండింగ్ మ్యాజిక్ వర్కవుట్ అవుతుంది.

2. టాప్-అప్ చేయకపోవడం:
ఏళ్ల తరబడి ఒకే అమౌంట్‌తో ఎస్‌ఐపీ కొనసాగించడం తప్పు. మీ జీతం పెరిగిన ప్రతిసారీ ఎస్‌ఐపీ మొత్తాన్ని కూడా 'స్టెప్-అప్' పద్ధతిలో పెంచుకుంటూ పోవాలి. అప్పుడే ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని పెద్ద మొత్తాన్ని పోగు చేయగలరు.

3. నిన్నటి విజేతల వెంట పడటం:
గతేడాది ఏ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందో చూసి అందులో ఇన్వెస్ట్ చేయడం పెద్ద పొరపాటు. మార్కెట్ సైకిల్ మారుతూ ఉంటుంది. ఫండ్ మేనేజ్మెంట్ నాణ్యత, పనితీరు చూసి మాత్రమే ఫండ్ ఎంచుకోవాలి.

4. లక్ష్యం లేకుండా పెట్టుబడి:
పిల్లల చదువు, పెళ్లి, రిటైర్మెంట్.. ఇలా ఒక గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే ఎంత డబ్బు అవసరమో తెలియదు. దీనివల్ల మధ్యలోనే డబ్బులు డ్రా చేసే ప్రమాదం ఉంది.

5. అతిగా డైవర్సిఫికేషన్:
ఒకేసారి 20-30 ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం కంటే గందరగోళమే ఎక్కువ. మీ పోర్ట్‌ఫోలియోలో 5 నుంచి 10 మంచి ఫండ్లు ఉంటే సరిపోతుంది.

6. అసెట్ అలోకేషన్ మర్చిపోవడం:
డబ్బు మొత్తం కేవలం ఈక్విటీలోనే పెట్టకూడదు. మీ వయస్సు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి విభాగాల్లో పెట్టుబడులను సర్దుబాటు చేయాలి.

7. ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ ధోరణి:
ఎస్‌ఐపీ పెట్టేసి మర్చిపోకూడదు. కనీసం ఏడాదికి ఒకసారి మీ ఫండ్ పనితీరును సమీక్షించాలి. బెంచ్‌మార్క్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫండ్లను మార్చుకోవాలి.

8. ఎమోషన్స్‌కు లోబడటం:
మార్కెట్ పెరిగినప్పుడు అత్యాశ, తగ్గినప్పుడు భయం పనికిరావు. ఎమోషన్స్‌తో కాకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయాలి.

9. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం:
కనీసం 6 నెలల అవసరాలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం రిస్క్. ఏదైనా ఆపద వస్తే అప్పటికప్పుడు ఎస్‌ఐపీ డబ్బులు తీయాల్సి వస్తుంది. దీనివల్ల లాంగ్ టర్మ్ గోల్స్ దెబ్బతింటాయి.

10. అసాధ్యమైన రిటర్న్స్ ఆశించడం:
స్టాక్ మార్కెట్ అంటే లాటరీ కాదు. దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్ల నుంచి 10-12% రిటర్న్స్ ఆశించడం రియాలిటీ. అంతకు మించి భారీ రిటర్న్స్ ఊహించి ఎక్కువ రిస్క్ తీసుకోవడం కొన్నిసార్లు నిరాశకు గురి చేస్తుందని మర్చిపోవద్దు ఇన్వెస్టర్స్.

సిప్ అనేది సంపద సృష్టించే ఒక శక్తివంతమైన పెట్టుబడి మార్గం. అయితే దీని విజయం మార్కెట్ టైమింగ్ మీద కంటే మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. పైన చెప్పిన తప్పులను సరిదిద్దుకుంటే ఆర్థిక భవిష్యత్తు లాభాల మయమే.