11 మంది కార్మికులకు రూ.10 కోట్ల జాక్ పాట్

11 మంది కార్మికులకు రూ.10 కోట్ల జాక్ పాట్

మలప్పురం: పదకొండుమంది మహిళలు.. అందరూ మున్సిపాలిటీ కా ర్మికులే. రోజంతా కష్టపడితేనే ఇల్లు గడిచే జీవితాలు. ఇండ్లల్ల ఎన్నో బాధలు, గోసలు. అదృష్టం కొద్దీ లాటరీ తగిలితే తమ సమస్యలన్నీ తీరుతాయని వారు భావించారు. కానీ రూ.250 పెట్టి లాటరీ టికెట్ కొనేందుకు ఎవరి దగ్గరా డబ్బుల్లేవ్. చివరికి మనిషికిన్ని డబ్బులేసుకుని టికెట్ కొన్నారు. అదృష్టం కొద్దీ లాటరీ తగిలింది. ఏకంగా రూ.10 కోట్లు జాక్ పాట్ గెలుచుకున్నరు. కేరళ మలప్పురం జిల్లాలోని పరప్పణగాడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేన విభాగం ఉంది. ఇందులో 11 మంది మహిళలు పని చేస్తున్నారు.

 వీళ్లంతా డంపింగ్ యార్డుకు వచ్చే చెత్తలోని ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి, రీసైక్లింగ్​కు పంపిస్తుంటారు. వీళ్లంతా కలిసి పోయినసారి ఓనం ఫెస్టివల్ టైమ్​లో లాటరీ టికెట్ కొన్నారు. ఆ టికెట్​కు రూ.7,500 బహుమతి రాగా.. అందరూ పంచుకున్నారు. ఇప్పుడు మనిషికిన్ని డబ్బులేసుకుని రూ.250 లతో మాన్ సూన్ బంపర్  టికెట్ కొన్నారు. లక్కీగా ఈసారి జాక్ పాట్ తగిలింది. వీళ్లు రూ.10 కోట్లు గెలుచుకున్నారని కేరళ ప్రభుత్వం లాటరీ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. ‘‘లాటరీ గెలిచినందుకు చాలా సంతోషంగాఉంది. ఇక మా సమస్యలన్నీ తీరిపోతాయి” అని రాధ అనే మహిళ చెప్పింది. ‘‘ఈసారీ అదృష్టం కొద్దీ మాకు జాక్ పాట్ తగిలింది” అని మరో మహిళ ఆనందం వ్యక్తం చేసింది.