సెలబ్రిటీలు తప్పుడు ప్రకటనల్లో నటిస్తే.. 10 లక్షల ఫైన్

సెలబ్రిటీలు తప్పుడు ప్రకటనల్లో నటిస్తే.. 10 లక్షల ఫైన్

కొన్ని వస్తువులకు సంబంధించి టీవీలు, పేపర్లలో వచ్చే అడ్వైర్టైజ్​మెంట్లను చూస్తే.. ఆహా, ఓహో అన్నట్టుగా ఉంటాయి. తీరా ఆ వస్తువులను కొన్న తర్వాత నాసిరకంగా ఉన్నాయని తెలుస్తుంది. మోసపోయామని తెలిసినా చాలా మంది సర్లె.. ఏదో కొన్నాం అయిపోయింది. అని ఊరుకుంటారు. కానీ.. ఇకపై వినియోగదారులు సరైన న్యాయం పొందేందుకు కొత్త హక్కులు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల రక్షణ బిల్లును రాజ్యసభ గత మంగళవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. లోక్​సభ ఇంతకుముందే ఈ బిల్లును అప్రూవ్​చేసింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చగానే వినియోగదారులకు ఐదు కొత్త హక్కులు లభించనున్నాయి. వాటితో పాటు ఈ బిల్లులో పెట్టిన మరికొన్ని అంశాలపైనా ఓ లుక్కేద్దాం..

ఎక్కడైనా కంప్లయింట్​చేయొచ్చు 

ఏదైనా కంపెనీ వస్తువు​ లేదా సర్వీస్​ బాగా లేదంటే వినియోగదారులు ఇప్పటివరకు ఆ వస్తువు కొన్న ప్రాంతం లేదా ఆ కంపెనీ ఆఫీస్‌‌ ఉన్న ప్రాంతంలోని వినియోగదారుల ​కోర్టులోనే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేది. కానీ, కొత్త చట్టంలోని రూల్స్​మేరకు, ఇకపై వినియోగదారులు తాము నివసిస్తున్న జిల్లా లేదా రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు.  దీనివల్ల వినియోగదారులపై వేధింపులు తగ్గుతాయని భావిస్తున్నారు. ఒకే వస్తువు ​లేదా సర్వీసు లోపంపై గుర్తింపు పొందిన వినియోగదారుల సంఘం లేదా కొంత మంది వినియోగదారులు కలిసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీంతోపాటు ఆన్​లైన్​లో కొంత ఫీజు చెల్లించి కంప్లయింట్​ చేసుకునేందుకు కూడా వినియోగదారుల వ్యవహారాల శాఖ త్వరలో రూల్స్‌‌ పెట్టనుంది.

ఈ-కామర్స్​కంపెనీలూ చట్టం పరిధిలోకి

ఒక నాసిరకం ప్రొడక్ట్​వల్ల నష్టపోయిన వినియోగదారులు ఆ వస్తువు​ను తయారు చేసిన లేదా అమ్మిన కంపెనీపై నష్టపరిహారం కోరుతూ ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఇతర అన్ని రకాల సేవలకు కూడా వర్తిస్తుంది. వస్తువు తయారీలో నాణ్యత లేకపోయినా, అందులో లోపం ఉన్నా,  ప్రొడక్ట్ ​ప్యాకింగ్​పై రాసిన మేరకు ప్రమాణాలు లేకపోయినా లేదా వారంటీ తేదీలోపు చెడిపోయినా దానిని ఉత్పత్తి చేసిన కంపెనీ లేదా వ్యక్తులే బాధ్యులవుతారు. అలాగే, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడాన్నీ ఈ కొత్త చట్టం నేరంగా పరిగణిస్తుంది. ఈ–కామర్స్​ కంపెనీలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

సామూహికంగా వినియోగదారుల రక్షణ 

ఒకే సమయంలో అనేక మంది వినియోగదారులు నష్టపోయేలా.. వారి హక్కులను ఉల్లంఘించడం, అక్రమ వ్యాపారం, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తే ఆ కంపెనీలపై ఒక వర్గం లేదా క్లాస్​ ప్రజల ప్రయోజనాల కోసం క్లాస్​ యాక్షన్ తీసుకోవాలని కోరుతూ జిల్లా, రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌‌, లేదా కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ అథారిటీ  (సీసీపీఏ)కి రాతపూర్వకంగా లేదా ఆన్​లైన్‌‌లో ఫిర్యాదు చేయవచ్చు.

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ

కొత్త చట్టం మేరకు, అఫిడవిట్​ లేదా డాక్యుమెంటరీ ఆధారాలతో తన ముందుకు వచ్చే ప్రతి కంప్లయింట్​ను కూడా జిల్లా కమిషన్ ​విచారించాల్సి ఉంటుంది. విచారణకు నేరుగా హాజరు కాలేమని, వీడియో కాన్ఫరెన్స్ ​ద్వారా విచారణ నిర్వహించాలని కోరితే అందుకు అనుమతిస్తారు.

ఫిర్యాదు ఎందుకు తిరస్కరించారో చెప్పాల్సిందే 

వినియోగదారుల కంప్లయింట్​ను పరిశీలించకుండా తిరస్కరించే అధికారం కమిషన్​కు ఉండదు. ఆ ఫిర్యాదు​ను విచారణకు స్వీకరిస్తున్నారా? లేదా? అన్నది కచ్చితంగా 21 రోజుల్లో చెప్పాల్సిందే. ఒకవేళ 21 రోజులు దాటినా కమిషన్​ఏదీ నిర్ణయించకపోతే, ఆ ఫిర్యాదును విచారణకు స్వీకరించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. వివాదం మధ్యవర్తిత్వంతో సెటిల్‌‌​ చేయవచ్చని కమిషన్ ​భావిస్తే, రెండు వర్గాలకూ ఆ విషయం తెలిపి, సెటిల్మెంట్​కు అనుమతిని ఇవ్వవచ్చు.

తప్పుదోవ పట్టించే ప్రకటనలకు శిక్షలు ఇలా…

తయారీదారులు: రెండేళ్ల వరకూ జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా (మొదటి నేరానికి).

మళ్లీ నేరం చేస్తే ఐదేళ్ల జైలు, రూ. 50 లక్షల వరకూ ఫైన్.

ఎండోర్సర్ (ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలు, ఇతరులు): రూ. 10 లక్షల వరకు ఫైన్​(తొలి నేరం అయితే, ఏడాది పాటు ఇతర ప్రొడక్ట్​లను ప్రచారం చేయకుండా నిషేధం). మళ్లీ నేరం చేస్తే రూ. 50 లక్షల ఫైన్, మూడేండ్లు నిషేధం. అయితే, సంబంధిత ప్రొడక్ట్​నాణ్యతను చెక్​చేసుకుని, సంతృప్తి చెందిన తర్వాతే దాని గురించి ప్రకటనల్లో ప్రచారం చేశానని ఎండోర్సర్​లు నిరూపిస్తే వారు నిర్దోషులుగా బయటపడవచ్చు. అలాగే, సాధారణ వ్యాపారంలో భాగంగానే తాము సంబంధిత కంపెనీకి ప్రకటనను తయారు చేసి ఇచ్చామని పబ్లిషర్/అడ్వర్టైజర్లు నిరూపిస్తే వారూ నిర్దోషులుగా తేలుతారు.

మరి వీటి సంగతి ఏమిటి?

బిల్లుపై వివాదాలు రేగకుండా ఉండేందుకోసం కేంద్ర ప్రభుత్వం హెల్త్​కేర్​ను ఈ బిల్లులోని సర్వీసెస్​లిస్టు నుంచి తొలగించింది.

వినియోగదారుల హక్కులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో సీసీపీఏ ఉన్నా, టెలికం, ఇన్సూరెన్స్​వంటి రంగాలకు వేర్వేరు అథారిటీలు ఉన్నాయి. కంప్లయింట్ చేసేందుకు వినియోగదారుల ​కోర్టులు, కౌన్సిళ్లు, అథారిటీల వంటివి ఎక్కువవడంతో వినియోగదారులు గందరగోళంలో పడే చాన్స్​ఉందని చెబుతున్నారు.

కంప్లయింట్ ​పరిశీలనకు 21 రోజుల డెడ్​లైన్​ను ఈ చట్టంలో పేర్కొన్నారు. కానీ దేశవ్యాప్తంగా 596 జిల్లా కన్జ్యూమర్‌‌ కమిషన్లలో 118 ప్రెసిడెంట్​పోస్టులు, 362 మెంబర్​పోస్టులు ఖాళీగా ఉన్నాయి.