సర్కార్ చొరవ చూపితేనే ఎత్తిపోసేది .. ఆసిఫాబాద్ జిల్లాలో నిరుపయోగంగా లిఫ్ట్ ఇరిగేషన్లు

సర్కార్ చొరవ చూపితేనే ఎత్తిపోసేది .. ఆసిఫాబాద్ జిల్లాలో నిరుపయోగంగా లిఫ్ట్ ఇరిగేషన్లు
  • ఏండ్లుగా రిపేర్లకు నోచుకోని పథకాలు
  • నీరందక నష్టపోతున్న అన్నదాతలు
  • కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఆశలు

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో నిర్మించిన ఎత్తి పోతల పథకాలన్నీ నిరుపయోగంగా మారి అన్నదాతకు నష్టాలు మిగుల్చుతున్నాయి. ఆసిఫాబాద్ ​జిల్లాలో 10 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టగా వాటికి సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. నిర్వహణకు లేక, మైనర్ రిపేర్లకు సైతం నిధులు కరువై చివరకు అవి పనికిరాకుండాపోయే పరిస్థితి నెలకొంది. బీడు భూములకు సాగు నీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు గత ప్రభుత్వాలు రూ.వందల కోట్లు వెచ్చించి ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గొప్ప ఆశయంతో ప్రారంభించిన ఈ పథకాల్లో కొన్ని ఏండ్ల కాలంగా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరికొన్ని పూర్తయినప్పటికీ నిర్వహణ సరిగ్గా లేకపని నిరుపయోగంగా ఉన్నాయి. 

ఇదీ పరిస్థితి..

ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత, పెన్ గంగా నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదుల్లో వేసవిలోనూ పుష్కలంగా నీరుంటుంది. జిల్లాలోని చివరి ఆయకట్టుకు వరకు రైతులకు నీరందాలనే ఉద్దేశ్యంతో మొత్తం 8 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. సిర్పూర్ నియోజకవర్గంలో నిరంతరం ప్రవహించే ప్రాణహిత, పెన్​గంగా నదుల మీద సిర్పూర్, చింతలమనేపల్లి, కౌటల మండలాల్లో ఏడు, ఆసిఫాబాద్ నియోజక వర్గ పరిధిలోని కెరమెరి మండలం సుర్దాపూర్​లో ఒక పథకాన్ని నిర్మించారు. కానీ ఇవేవీ జిల్లా రైతులకు ఉపయోగపడడంలేదు. మోటార్లు చెడిపోయి, ఏండ్లగా రిపేర్లు చేయక, పర్యవేక్షణ లేక నీళ్లు ఎత్తిపోయడం లేదు. దీంతో పొలాలకు సాగు నీరుందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వమైనా చొరవ చూపి లిఫ్ట్ ఇరిగేషన్​ స్కీమ్​ల రిపేర్లకు  నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.

  •  సిర్పూర్ మండలం లోన్​వెల్లిలో 2010లో పెన్ గంగ మీద ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఈ పథకం కింద 1100 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ పథకం మోటర్లు చెడిపోవడంతో నిరుపయో గంగా మారింది.
  • చింతలమనేపల్లి మండలంలోని ప్రాణహిత నదీ మీద రణవెల్లి గ్రామం వద్ద 2008లో రూ.28 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు చేపట్టారు. 4500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. 
  •  కాగజ్ నగర్ మండలం అందెవెల్లి వద్ద 1989లో రూ.28 లక్షలతో నిర్మించిన ఎత్తిపోతల పథకానికి కాలువలు లేకపోవడంతో ఒక్క ఎకరానికి సాగు నీరు అందించలేదు. 300 ఎకరాల ఆయకట్టు భూమికి సాగునీరందించాల్సి ఉన్నా కొన్నేండ్లుగాగా నిరుపయోగంగా ఉంది.
  •  చింతలమనేపల్లి మండలం గూడెం వద్ద 2020లో రూ. 17.50 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ప్రారంభించారు. 2 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఏండ్లుగా నిర్మాణ దశలోనే మగ్గుతోంది.
  •      కెరమెరి మండలంలోని సుర్దాపూర్ పెద్దవాగువద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం అలంకారప్రాయంగా మారింది. ఈ పథకం ద్వారా నేటికీ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు.
  • 1998లో రూ .3 కోట్లతో దీన్ని నిర్మించారు. మోటర్లు రిపేర్లు, పైప్​లైన్ మరమ్మతులు చేయక చుక్క నీరు అందించడం లేదు.
  •     ప్రాణహిత నది మీద చింతలమనేపల్లి మండలం కోర్సిని వద్ద 13 ఏండ్ల క్రితం రూ. 48 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. 8 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించే ఈ పధకం ఇంకా నిర్మాణ దశలోనే మగ్గుతోంది. ఈ పథకం పూర్తికాకపోవడంతో ఏటా రైతులకు నిరాశే మిగులుతోంది.
  •     కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 2006లో సుమారు రూ.3 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించగా అప్పటి నుంచి అలంకారప్రాయంగానే ఉంది. 1000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ పథకం మోటర్లు కాలిపోవడంతో రిపేర్లు లేక నిరుపయోగంగా మారింది.

పథకాలకు రిపేర్లు చేయాలి

ఊరికి పక్కనే ప్రవహిస్తున్న వార్థ నది మీద కట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చెడిపోయింది. రిపేర్ల గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. నీరందక రైతులు నష్టపోతున్నారు. వానాకాలం తప్ప రెండో పంట సాగు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్లకు రిపేర్లు చేసి పంటలకు నీళ్లందించాలి.

చాప్లె లహంచు, రైతు, గుండాయిపేట్, కౌటాల మండలం