
- అందుబాటులోకి స్పెషలిస్ట్ సేవలు
- ఎంసీహెచ్‌లో పెరిగిన సాధారణ కాన్పులు
- జనరల్ కేసులకూ ఆధునిక టెక్నాలజీ వినియోగం
- వైద్యసేవలపై ప్రశంసించిన వైద్య విధాన పరిషత్
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన హాస్పిటల్‌లో రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా జనరల్ కేసులన్నింటికీ ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఎంసీహెచ్‌లోనూ గతం కంటే డెలివరీస్ పెరగగా.. అందులోనూ నార్మల్డెలివరీలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కొంతకాలంగా స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో హైరిస్క్ కేసులకు కూడా ట్రీట్‌మెంట్ అందుతోంది.
హాస్పిటల్‌లో గతంలో 150 బెడ్లు ఉండగా.. ఇప్పుడు మరో 100(ఎంసీహెచ్, జనరల్ హాస్పిటల్ కలిపి) పెరిగాయి. ప్రస్తుతం హాస్పిటల్‌కు కొత్త బిల్డింగ్ నిర్మిస్తుండగా మరో 100 బెడ్లు అందుబాటులోకి వస్తాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కాగా ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్డాక్టర్ అజయ్‌కుమార్ హాస్పిటల్‌ను సందర్శించారు. ఇక్కడ అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తంచేస్తూ సిబ్బందిని ప్రశంసించారు.
అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు
గతంలో రిస్క్ కేసులు వస్తే కరీంనగర్‌కు రిఫర్ చేసేవారు. పెరిగిన టెక్నాలజీతో ఎలాంటి కేసుకైనా ఇక్కడే వైద్యం అందిస్తున్నారు. గతంలో ఇక్కడ గైనకాలజీ, అనిస్తీషియా, పీడియాట్రిక్, జనరల్ సేవలు మాత్రమే అందుబాటులో ఉండగా.. కొంతకాలంగా ఆర్థో, కార్డియాలజీ, రేడియోలజీ, డెర్మిటాలజీ, డెంటల్, ఫిజియోథెరపీ, ఈఎన్‌టీ సేవలను కూడా అందిస్తున్నారు. దీంతో డెలివరీస్‌తో పాటు అబ్డామినల్ హిస్టెరెక్టమీ, ఆర్థోపెడిక్ ఆపరేషన్లు, డెంటల్, కంటి ఆపరేషన్లు చేస్తున్నారు.
జనరల్ మెడిసిన్ విభాగం హాస్పిటల్‌లో ప్రధాన విభాగం కాగా.. ప్రతీ నెలా దాదాపు జనరల్ ఆపరేషన్లు 30 నుంచి 40 దాకా చేస్తున్నారు. అందులో దాదాపు మూడు వరకు లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేస్తున్నారు. గతంలో ఆర్థో లేకపోవడంతో చిన్న చిన్న యాక్సిడెంట్లకు కూడా కరీంనగర్, వరంగల్ హాస్పిటళ్లకు పంపేవారు. కానీ ప్రస్తుతం జిల్లా హాస్పిటల్‌లో ఆర్థో సేవలు అందుబాటులోకి రావడంతో 35 నుంచి 40 వరకు సర్జరీలు చేస్తున్నారు. దాదాపు 100 వరకు కంటి ఆపరేషన్లు జరుగుతున్నాయి. అలాగే 5 బెడ్స్‌తో డయాలసిస్‌ను ఏర్పాటు చేశారు.
తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా అల్ట్రా సౌండ్ స్కానింగ్, టిఫ్ఫా, 2డీ ఎకో, గర్భస్త శిశువు గుండె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే ఎస్ఎన్‌సీయూ టెస్ట్‌లు కూడా ఇక్కడే చేస్తున్నారు. అలాగే శిశువుల కోసం వెంటిలేటర్లు, ఫొటోథెరఫీ, ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేశారు. ఎంసీహెచ్‌లో ఆరుగురు పీడియాట్రిషన్లు, ఐదుగురు గైనకాలజిస్టులు, ఐదుగురు అనస్తీషియా డాక్టర్లు ఉన్నారు. గతంలో డెలివరీ తర్వాత పుట్టిన శిశువును తీసుకొని ప్రైవేటు హాస్పిటళ్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. కానీ ఏడాదిగా జిల్లా హాస్పిటల్‌లోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
రానున్న రోజుల్లో మరిన్ని సేవలు
జిల్లా ప్రజలకు జనరల్ హాస్పిటల్‌లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఏడాదిగా హాస్పిటల్‌లో వివిధ హైరిస్క్ విభాగాలను ఏర్పాటు చేశాం. ఆధునిక టెక్నాలజీతో వైద్యం అందిస్తున్నాం. రానున్న రోజుల్లో యూరాలజీ, మోకాలు మార్పిడి ఆపరేషన్లు కూడా అందుబాటులోకి తెస్తాం. -శ్రీధర్, సూపరింటెండెంట్, పెద్దపల్లి జిల్లా హాస్పిటల్