
- దాదాపు 15 ఏండ్లుగా దళారులకే విక్రయం
- మంచి ధరే పెడతామని రైతులకు నమ్మబలుకుతున్న వైనం
- వనపర్తి జిల్లాలో5,870 ఎకరాల్లో సాగు
వనపర్తి, వెలుగు: పత్తికి మద్దతు ధర దక్కితే బాగుండని ఎదురుచూస్తున్న రైతులకు ఏటా నిరాశే ఎదురవుతోంది. వనపర్తి జిల్లాలో పంట సాగు చేస్తున్నా కొనుగోలుకు సీసీఐ కేంద్రాలు లేకపోవడంతో దళారులకు తెగనమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి పత్తికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,110 ప్రకటించింది.
జిల్లాలో నాలుగైదు మండలాల్లో మినహా మిగతా అన్ని మండలాల్లో ఈ పంటనే వేశారు. ఇప్పుడిప్పుడే పత్తి ఏరుతున్నారు. స్థానికంగా సీసీఐ కేంద్రాలు లేకపోవడంతో రైతులు గతంలో 60 కి.మీ. దూరంలో ఉన్న జడ్చర్ల తదితర ప్రాంతాలకు పత్తిని తరలించేవారు. గతేడాది పెద్దమందడి మండలం నుంచి ఏకంగా కర్నాటక రాష్ట్రంలోని రాయిచూరు వెళ్లి పత్తి మిల్లులకు విక్రయించారు.
దళారుల వైపే మొగ్గు..
ఇప్పుడు స్లాట్సిస్టం వచ్చింది. ఆన్లైన్లో బుక్‌చేసుకున్న తేదీకి వెళ్లినా ఆరోజు పత్తి విక్రయమవుతుందన్న గ్యారంటీ లేదు. దూరభారంతోపాటు రెండు, మూడు రోజులు వేచివుండాల్సి వస్తుందని భావిస్తున్న రైతులు గత్యంతరం లేక దళారుల వైపే మొగ్గు చూపుతున్నారు. కొన్నేళ్లుగా దళారులు జిల్లాలోలో పత్తి సాగు చేసే ప్రాంతాలకు వచ్చి కాంటాలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
ఈసారి కూడా రైతులను సంప్రదించి.. తామే కొనుగోలు చేస్తామని, మంచి ధరే పెడతామని నమ్మబలుకుతున్నారని అన్నదాతలు చెబుతున్నారు. వారిపై తమకు నమ్మకం లేదని, తేమ, రంగు, ట్రాన్స్పోర్ట్ చార్జీ అంటూ తక్కువ ధరకే కొంటారని అంటున్నారు. గతేడాది మద్దతు ధర రూ.6 వేలకు పైగా ఉంటే రూ.4,500 వరకు చెల్లించారని పేర్కొంటున్నారు.
తగ్గిన విస్తీర్ణం
జిల్లాలో పంటల మార్పిడిలో భాగంగా వరి వేసే రైతులు ఈసారి పత్తి పంట వైపు మళ్లారు. మొత్తం 2,44,137 ఎకరాలకు గానూ 1,99,717 ఎకరాల్లో వరి సాగు చేశారు. 15,680 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ, 5,870 ఎకరాల్లోనే వేశారు. పత్తి పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నా అందకపోవడం, వేసిన కొద్దిపాటి పంట కూడా ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతినడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు.
40 శాతానికి పడిపోయిన దిగుబడి
ఈ వానాకాలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి పంట తడిసి, రంగు మారింది. పంట బాగుంటే దిగుబడి ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు రావాలి. కానీ, 40 శాతానికి పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 6.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అత్యధికంగా నాగర్‌కర్నూలు జిల్లాలో 2.54 లక్షల ఎకరాల్లో, నారాయణపేటలో 1.54 లక్షలు, మహబూబ్‌నగర్‌లో 1,32 లక్షలు, జోగులాంబ గద్వాలలో 85 వేలు, వనపర్తిలో 5,870 ఎకరాల్లో పండించారు. మొదట్లో అంతటా వర్షాలు అనుకూలించడంతో దిగుబడి బాగా వస్తుందని ఆశించారు. కానీ, తర్వాత కురిసిన భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా పంట దెబ్బతింది.