
- ఇప్పటివరకూ 10 మందికి కొనసాగుతున్న ట్రీట్మెంట్
జీడిమెట్ల, వెలుగు: సిటీలో కల్తీ కల్లు కలవరం కొనసాగుతూనే ఉంది. కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి పలువురు మృతి చెందగా, కుత్బుల్లాపూర్‌లో ఇద్దరు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అధికారులు కల్లు దుకాణాల్లో తనిఖీ చేస్తూ మత్తుపదార్థాలు కలపకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఇన్నాళ్లు మత్తు కల్లుకు అలవాటు పడ్డ బాధితులంతా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మత్తు దొరకపోవడంతో అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి పలువురు బాధితులు క్యూ కడుతున్నారు.
ప్రస్తుతం మల్లారెడ్డి ఆసుపత్రిలో 10 మంది కల్లు బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందిని డాక్టర్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు కల్లుదుకాణాల్లో ప్రమాదకర మత్తు పదార్థాలు కల్లులో కలిపి విక్రయించినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని బాధిత కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ఇక నుంచైనా అధికారులు నిఘా తీవ్రతరం చేసి కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.
కోలుకుంటున్న కల్తీ కల్లు బాధితులు
పద్మారావునగర్: కూకట్ పల్లి కల్తీ కల్లు బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. గాంధీ దవాఖానలో ప్రస్తుతం ఏడుగురికి చికిత్స అందిస్తున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు లామాపై బయటకు వెళ్లిగా, పూర్తిగా కోలుకున్న నలుగురిని డిశ్చార్జ్ చేశామని, ఒకరు చనిపోయారని ఆయన చెప్పారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఏడుగురి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. నిమ్స్‌లో 36 మంది అడ్మిట్ కాగా 23 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 13 మంది ట్రీట్మెంట్ తీసుకుంటుండగా, ఐదుగురు డిశ్చార్జీకి సిద్ధంగా ఉన్నారు. ఆరుగురికి డయాలసిస్ చేస్తున్నామని, ఇద్దరిని డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉంచామని సూపరింటెండెంట్ తెలిపారు.