ఒక్కో లోక్ సభ సీటుకు 100 కోట్లు

ఒక్కో లోక్ సభ సీటుకు 100 కోట్లు

మీరు ఓటుకు నోటు తీసుకొని ఉండకపోవచ్చు లేదా నేతలు పంచిన నోట్లు మీదాకా చేరకపోవచ్చు కానీ రాజకీయ పార్టీలు మాత్రం దేశవ్యాప్తంగా ఒక్కో ఓటరుపై సగటున రూ.700 ఖర్చుచేశాయి. ఒక్కో లోక్​సభ నియోజకవర్గంలో రూ.100కోట్ల చొప్పున కుమ్మరించాయి. ఆ లెక్కన మొన్నటి లోక్​సభ ఎన్నికల మొత్తం ఖర్చు అక్షరాలా రూ.60 వేల కోట్లు. ఇవేవో కాకిలెక్కలుకావు. ప్రఖ్యాత రీసెర్చ్​ ఆర్గనైజేషన్​ ‘సెంటర్​ ఫర్​ మీడియా స్టడీస్​(సీఎంఎస్​)’ ఎన్నికల ప్రక్రియను దగ్గర్నుంచి పరిశీలించి రూపొందించిన అంచనాలు.

ఎలా లెక్కించారు?…

ఎన్నికల ఖర్చును అంచనా వేయడానికి సీఎంఎస్​ సంస్థ ‘పీఈఈ’ విధానాన్ని అనుసరించింది. ఎంపికచేసుకున్న లోక్​సభ స్థానాల్లో పర్సెప్షన్​(అవగాహన)తో ముందుకెళుతూ, ఆయా పార్టీల పనుల్ని ఎక్స్​పీరియన్స్(ప్రత్యక్ష​ అనుభవం) చేస్తూ, అవి చేసిన ఖర్చులపై ఎస్టిమేషన్స్​​(అంచనాలు) వేశారు. సెకండరీ డేటాతోపాటు మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిగణలోకి తీసుకుని తుది రిపోర్ట్​ తయారుచేసినట్లు సీఎంఎస్​ ఫౌండర్​ ఎన్​. భాస్కర్ వివరించారు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్​ ఎస్​వై ఖురేషీ, మాజీ ఐపీఎస్​ అధికారి డీఆర్​ కార్తికేయతో కలిసి ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో ఎన్నికల ఖర్చు రిపోర్టును విడుదల చేశారు.

ఖర్చులో బీజేపీనే టాప్​…

లోక్​సభ ఎన్నికల్లో ఎక్కువ డబ్బులు ఖర్చుచేసింది బీజేపీనే అని, మొత్తం వ్యయంలో ఆ పార్టీ చేసిన ఖర్చు 45 శాతంగా ఉందని రిపోర్టులో పేర్కొన్నారు. 1998 ఎన్నికల మొత్తం ఖర్చులో బీజేపీ వాటా 20 శాతం కాగా,  2019లో ఖర్చులో 45 శాతం ఆ పార్టీదేనని నివేదికలో తెలిపారు. 1998 నుంచి ఎన్నికల వ్యయం పెరుగుతూ వస్తోందని,  ఈ ఎన్నికల్లో మనీ పవర్​ ప్రభావం చూపిందని,  పార్టీలకు విరాళాలిచ్చే దాతల పేర్లు సీక్రెట్​గా ఉండేలా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఎలక్టోరల్​ బాండ్​’ విధానం కూడా ఖర్చుపెరగడానికి దోహదం చేసిన అంశాల్లో ఒకటని మాజీ సీఈసీ ఖురేషీ అభిప్రాయపడ్డారు. 2009లో మొత్తం ఎన్నికల ఖర్చులో కాంగ్రెస్​ వాటా 40 శాతంగా ఉంటే, 2019లో మాత్రం 20 శాతానికి మించలేదని తెలిపారు.

మెజార్టీ ఖర్చు ప్రచారానికే…

సీఎంఎస్​ రిపోర్టు ప్రకారం మొత్తం ఎన్నికల ఖర్చులో 20 నుంచి 25 శాతం డబ్బును ఓటర్లకు పంచారు. ప్రచారం కోసం 30 నుంచి 35 శాతం డబ్బులు వెచ్చించారు. ఈసీ నిబంధనల ప్రకారం అధికారికంగా చేసిన ఖర్చు 15 నుంచి 20 శాతం ఉటుందని రిపోర్టులో తెలిపారు. స్థూలంగా ఒక్కో లోక్​సభ నియోజకవర్గంలో పార్టీలు రూ.100 కోట్లు కుమ్మరించాయని, ఒక్కో ఓటరుపై రూ.700 ఖర్చు చేశాయని సీఎంఎస్​ అంచనా వేసింది.