అయోధ్యకు 100 మంది విదేశీ ప్రతినిధులు

అయోధ్యకు 100 మంది విదేశీ ప్రతినిధులు

అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 55 దేశాల నుంచి దాదాపు 100 మంది ప్రముఖులు హాజరుకానున్నారని వరల్డ్ హిందూ ఫౌండేషన్ గ్లోబల్ చైర్మన్ స్వామి విజ్ఞానానంద్ తెలిపారు.

అయోధ్య: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి విదేశాల ప్రతినిధులు రానున్నారు. 55 దేశాల నుంచి దాదాపు 100 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఆయా దేశాల ఎంపీలు, అంబాసిడర్లు, రాజకీయ ప్రముఖులను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించామని వరల్డ్ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గ్లోబల్ చైర్మన్ స్వామి విజ్ఞానానంద్ తెలిపారు. కొరియా రాణికి కూడా ఆహ్వానం అందించామని చెప్పారు. ఆదివారం మీడియాతో విజ్ఞానానంద్ మాట్లాడారు. విదేశాల ప్రతినిధులందరూ ఈ నెల 20న లక్నోకు వస్తారని ఆయన తెలిపారు. 21న సాయంత్రం అయోధ్యకు చేరుకుంటారని చెప్పారు.

చలి, దట్టమైన పొగమంచు లాంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఈవెంట్ కు ముందే రావాలని విదేశీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశామన్నారు. ఇంకా ఎక్కువ మంది ఫారిన్ డెలిగేట్స్​ను ఆహ్వానించాలని నిర్ణయించినా.. అయోధ్యలో తక్కువ ప్లేస్ ఉండడంతో గెస్ట్ లిస్టును తగ్గించాల్సి వచ్చిందన్నారు. 

యూపీకి అమెరికా యువతి.. 

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ సోనాల్ సింగ్ ఉత్తరప్రదేశ్​కు వచ్చింది. అయోధ్యకు వెళ్లేందుకు అందరికీ అవకాశం లేనందున, ఇక్కడి నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షిస్తానని సోనాల్ సింగ్ తెలిపింది. ఆరోజు పదకొండు వేలసార్లు రామనామం రాయనున్నట్టు చెప్పింది. కాగా, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు రాజస్థాన్​లో వైన్ షాపులను బంద్ చేయనున్నట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది.