అవినీతిలో కేసీఆర్ కు వంద పీహెచ్​డీలు ఇవ్వొచ్చు : ఆకునూరి మురళి

అవినీతిలో కేసీఆర్ కు వంద పీహెచ్​డీలు ఇవ్వొచ్చు :  ఆకునూరి మురళి
  • ఆ మూడు పార్టీలు ఒక్కటే
  • కమిషన్లు వచ్చే ప్రాజెక్టులే చేపడుతుండ్రు

ఆదిలాబాద్, వెలుగు : ‘భయంకరణమైన అవినీతి ఇప్పుడున్న అందరు రాజకీయ నాయకులు చేస్తున్నారు..దాంట్లో మన సీఏం కేసీఆర్ కు వంద పీహెచ్​డీలు ఇవ్వొచ్చు.. పాతకాలంలో కూడా కరప్షన్ ఉండే కానీ, ఈ అవినీతి వేరేలా ఉంది’ అని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణలో అవినీతి, ఆర్థిక దోపిడీ, దేశంలో విద్వేష, విభజన వ్యతిరేక రాజకీయాలను ఒడిద్దామనే నినాదంతో ‘జాగో తెలంగాణ’ పేరిట ఆదిలాబాద్ లోని పీఆర్టీయూ భవనంలో సోమవారం సమావేశం నిర్వహించారు. హైకోర్టు రిటైర్డ్ జస్టిస్​ చంద్ర కుమార్, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, నైనాల గోవర్ధన్, పృథ్వీరాజ్, రచయిత స్కైబా, శశికాంత్ దీనికి హాజరయ్యారు. ఆకునూరి మురళి మాట్లాడుతూ ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి ఇంత అవినీతి చేయలేదని, అబద్దాలు ఆడలేదన్నారు. ఇంతకుముందు ఐఏఎస్, ఐపీఎస్, ప్రభుత్వ అధికారులు ఇంత కరప్షన్ చేసేవాళ్లు కాదన్నారు. మూడేండ్లలో రూ.75 వేల కోట్లు రైతు బంధు పేరిట పంచారని.. ఇందులో రూ. 28 వేల కోట్లను రైతులు కాని ఎన్నారైలకు, సినీనటులకు, మంత్రులకు ఇచ్చారన్నారు. కేసీఆర్ కూడా రైతుబంధు తీసుకోవడం పిచ్చి పరిపాలనకు పరాకాష్టగా వర్ణించారు. 20 లక్షల కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు మూడు కలిసి పనిచేస్తున్నాయని, ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. రూ. 60 లక్షల కోట్లు స్విస్​బ్యాంకులో ఉన్నాయని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పిన నరేంద్ర మోదీ ఒక్కరి ఖాతాల్లోనైనా డబ్బులు వేశారా అని ప్రశ్నించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నా  హామీ ఏమైందన్నారు. రూ.16 లక్షల కోట్ల లోన్లు ధనవంతులు, బనియాలు, ఠాగూర్లు, కపూర్లు, ఆదానీలకు మాఫీ చేశారన్నారు. కేంద్రం రూ. 36 లక్షల కోట్ల బడ్జెట్​లో కేవలం రెండున్నర శాతం మాత్రమే విద్యకు కేటాయిస్తోందన్నారు. రూ.10 లక్షల కోట్ల రూపాయలు పన్ను రూపంలో మన రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లాయని.. కానీ పనికిరాని పనులకు వేల కోట్లు పెడుతున్నారే తప్ప బడులు బాగు చేసేందుకు పెట్టడం లేదన్నారు.

ఎన్నికల నేపథ్యంలో మోసం చేసేందుకు...

కేసీఆర్ కేవలం కమీషన్లు వచ్చే ప్రాజెక్టులు మాత్రమే చేపడుతున్నారని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్ర కుమార్ అన్నారు. ఎనిమిదేండ్ల కింద ఉన్న ఒక ఎమ్మెల్యే ఆస్తి ఇప్పుడు ఎంతైందో చూస్తే వాళ్ల దోపిడీ ఏ స్థాయిలో ఉందో  తెలిసిపోతుందన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఆస్తులు ఎంత పెరిగాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని.. వీటిని తిప్పికొట్టేందుకు అన్ని జిల్లాల్లో తెలంగాణ జాగో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.