లజోవా సిటీలో 1000 అపార్ట్ మెంట్లు ధ్వంసం

లజోవా సిటీలో 1000 అపార్ట్ మెంట్లు ధ్వంసం
  • 11 విద్యాసంస్థలపైనా రష్యా బాంబుల వర్షం 
  • డాన్బాస్ లో హోరాహోరీగా పోరాటం 
  • నాలుగో నెలలోకి ప్రవేశించిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం


కీవ్/మాస్కో:ఉక్రెయిన్ లోని ఖార్కివ్ రీజియన్ లో ఉన్న లజోవా సిటీపై రష్యా శుక్రవారం బాంబుల వర్షం కురిపించింది. సిటీలో దాదాపు 1000 అపార్ట్ మెంట్లు, 11 విద్యాసంస్థలు ధ్వంసం అయ్యాయని ఆ సిటీ మేయర్ షెర్హీవ్ జెలెన్ స్కీ వెల్లడించారు. రష్యా క్షిపణి దాడుల్లో హౌస్ ఆఫ్ కల్చర్, ఖార్కివ్ ఆటోమొబైల్ అండ్ రోడ్ కాలేజ్ భవనం కూడా ధ్వంసం అయినట్లు తెలిపారు. అయితే, సిటీపై రష్యా దాడుల్లో ఎంత మంది చనిపోయారు? ఎంత మంది గాయపడ్డారు? అన్న వివరాలు వెల్లడికాలేదు. ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మంగళవారం నాటికి నాల్గో నెలలోకి ప్రవేశించింది. పన్నెండు వారాల పాటు భీకర పోరాటం తర్వాత రష్యా తాజాగా తూర్పున ఉన్న డాన్బాస్ రీజియన్ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. దేశ రాజధాని కీవ్ ను ఆక్రమించుకునేందుకు 60 కిలోమీటర్ల కాన్వాయ్ ని పంపినా.. ఫలితం లేకపోవడంతో తమ బలగాలను వెనక్కి తీసుకుంది. దక్షిణాదిన కీలకమైన మరియుపోల్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న రష్యన్ బలగాలు ప్రస్తుతం డాన్బాస్ పైనే దాడులు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాన కీవ్ లో, ఈశాన్యంలోని ఖార్కివ్ రీజియన్ లో రష్యా సేనలకు ఉక్రెయిన్ బలగాలు అడ్డుకట్ట వేశాయి. ఖార్కివ్ నుంచి రష్యా సేనలు వెనుదిరిగినా.. మిసైల్ దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన డాన్బాస్​ రీజియన్​తో పాటు ఉక్రెయిన్ దక్షిణ తీరంలో ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. 
 

కాల్పులు ఆపే ప్రసక్తే లేదు: ఉక్రెయిన్ 
డాన్బాస్ లో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య హోరాహోరి పోరాటం కొనసాగుతోంది. డాన్బాస్ లో కాల్పుల విరమణకు సిద్ధమైనట్లు వచ్చిన వార్తలను ఉక్రెయిన్ ఖండించింది. రష్యాపై పోరాటం కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. రష్యా మద్దతు ఇస్తున్న వేర్పాటువాదులు ఇప్పటికే డాన్బస్​లోని లుహాన్స్క్, డోనెట్స్క్ ప్రావిన్స్ లలోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ప్రాంతాలను కూడా తమ కంట్రోల్​లోకి తీసుకునేందుకు రష్యా శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. 


తేలని అజోవ్ ఫైటర్ల భవితవ్యం 
మరియుపోల్​లోని అజోవ్​స్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి రష్యా బందీలుగా పట్టుకున్న 2,500 మంది ఉక్రెయినియన్ ఫైటర్ల భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. అజోవ్ ఫైటర్లపై నాజీలుగా ముద్రవేస్తున్న రష్యా.. వారిని  యుద్ధ ఖైదీలుగా విచారించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ తన భవిష్యత్తును తానే నిర్ణయించుకోవాలని పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ చెప్పారు. ఆదివారం ఆయన కీవ్​లో పర్యటించి ఉక్రెయిన్ పార్లమెంట్​ను ఉద్దేశించి మాట్లాడారు. మరోవైపు ఉక్రెయిన్​లో మార్షల్ లాను ఆ దేశం మరో మూడు నెలల పాటు పొడిగించింది. దీంతో ఆగస్టు 23 వరకు మార్షల్ లా అమలులో ఉండనుంది.  

బైడెన్ సహా 963 మందిపై రష్యా బ్యాన్ 
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సహా 963 మంది అమెరికన్లపై రష్యా శాశ్వత నిషేధం విధించింది. వీరిని తమ దేశంలోకి అడుగుపెట్టనివ్వబోమంటూ,  వీరిందరి పేర్లతో కూడిన లిస్ట్‌‌‌‌ను రష్యా విదేశాంగ శాఖ రిలీజ్ చేసింది. రష్యాకు వ్యతిరేకంగా ఎడతెరిపి లేకుండా అమెరికా ఆంక్షలను విధిస్తున్న నేపథ్యంలో ఈ బ్లాక్ లిస్ట్‌‌‌‌ను రష్యా ప్రకటించింది. ఇంతకుముందు తమ దేశంలోకి ఎంటర్ కాకుండా 26 మంది కెనడియన్లపై కూడా బ్యాన్ విధించింది.