గుడ్ న్యూస్: ఐదేళ్ళలో వెయ్యి కొత్త రైళ్లు.. త్వరలోనే బుల్లెట్ రైలు

గుడ్ న్యూస్: ఐదేళ్ళలో వెయ్యి కొత్త రైళ్లు.. త్వరలోనే బుల్లెట్ రైలు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వేస్.. వచ్చే ఐదేళ్ళలో వెయ్యి కొత్త రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా 2027 నాటికల్లా బుల్లెట్ రైలు సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది ఇండియన్ రైల్వేస్. రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి, ఖర్చులను తగ్గించడానికి, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.

వచ్చే ఐదేళ్ళలో వెయ్యి కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని.. 2027 నాటికి బుల్లెట్ రైలు సర్వీసులను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి అశ్విని వైష్ణవ్. రైల్వే ఎగుమతుల్లో గ్లోబల్ ప్లేయర్ గా ఎదగడం.. దేశంలో కాస్ట్ ఎఫిషియంట్ లాజిస్టిక్స్ ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులు తెస్తున్నట్లు తెలిపారు వైష్ణవ్.

11 ఏళ్లలో 35 వేల కిలోమీటర్ల ట్రాకులు:

గత 11 ఏళ్లలో ఇండియాలో 35 వేల కిలోమీటర్ల ట్రాకులను నిర్మించామని.. ఇది జర్మనీలోని మొత్తం నెట్వర్క్ కి సమానమని పేర్కొన్నారు వైష్ణవ్. ఇండియన్ రైల్వే ఒక్క ఏడాదిలోనే 5 వేల 300 కిలోమీటర్ల నెట్వర్క్ ను విస్తరించిందని తెలిపారు. ప్రతి ఏటా 30 వేల వ్యాగన్లు, 15 వందల లోకోమోటివ్ లు తయారవుతున్నట్లు తెలిపారు. ఇది ఉత్తర అమెరికా, యూరప్ దేశాల ఉత్పత్తి కంటే ఎక్కువ అని తెలిపారు.

అంతేకాకుండా, రైల్వేలలో పెట్టుబడి రూ.25,000 కోట్ల నుండి రూ.2.52 లక్షల కోట్లకు పెరిగిందని, పీపీపీల నుండి అదనంగా రూ.20,000 కోట్లు వచ్చాయని ఆయన అన్నారు.

బుల్లెట్ రైలు ప్రారంభం: 

జపాన్ సహకారంతో హై స్పీడ్ రైలు ప్రాజెట్టు పనులు వేగంగా జరుగుతున్నాయని.. 2026లో మొదటి నమూనా రానుందని.. 2027 నాటికి సర్వీసులు ప్రారంభించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు వైష్ణవ్. ఏటా జరిగే రైలు ప్రమాదాలు 170 నుండి 30 కి తగ్గాయని.. గత పదేళ్లలో రైలు ప్రమాదాలు 80 శాతం తగ్గాయని అన్నారు. రోజువారీ భద్రతా సమీక్షలు, ట్రాక్ పాయింట్, సిగ్నలింగ్ సిస్టంలలో నవీకరణలు కారణమని అన్నారు వైష్ణవ్.

►ALSO READ | రష్యాలో 10 లక్షల ఉద్యోగాలు : ఇండియా వాళ్లకే ఇస్తామంటున్న పుతిన్