24 గంటల్లో 1000 మంది రష్యా సైనికులు హతం

24 గంటల్లో 1000 మంది రష్యా సైనికులు హతం

కీవ్: మిస్సైళ్లు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాకు ఉక్రెయిన్​ గట్టి కౌంటర్​ ఇచ్చింది. 24 గంటల్లో 1,000 మంది రష్యన్​ రిజర్విస్టులను హతమార్చినట్టు ఉక్రెయిన్​ రక్షణ శాఖ మంత్రి సర్గీ షోయిగు బుధవారం ప్రకటించారు. యుద్ధం​ మొదలైనప్పటి నుంచి 71,200 మంది రష్యా సైనికులను చంపేసినట్టు తెలిపారు. ఆయుధాల్లేకుండా ఉక్రెయిన్​ వైపు కదులుతున్న దళాలనే లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు వివరించారు. ఉక్రెయిన్​తో యుద్ధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్​ సైనిక సమీకరణ చేపట్టారని, మొత్తం 41,000 మంది రిజర్విస్టులు ఈ వార్​లో పాల్గొంటున్నారని వివరించారు. వీరి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని తెలిపారు. అమాయకులైన ప్రజలను యుద్ధంలో బలి చేస్తున్నారని పుతిన్ పై విమర్శలు గుప్పించారు. వార్​ మొదలైన తర్వాత రష్యా తొలిసారి భారీగా సైనికులు నష్టపోయిందన్నారు. అదేవిధంగా, కీవ్​లో ధ్వంసమైన వాటర్, పవర్​ సప్లైను పునరుద్ధరించినట్టు వివరించారు. అయితే ఈ విషయంపై రష్యా స్పందించలేదు.

ఎక్స్​పోర్టు డీల్  పునరుద్ధరణ

ఉక్రెయిన్​ నుంచి ఆహార ధాన్యాలతో బయలుదేరే నౌకల సెక్యూరిటీకి సంబంధించి గతంలో రష్యా, ఉక్రెయిన్​ మధ్య అగ్రిమెంట్​ కుదిరింది. యునైటెడ్​ నేషన్స్ మధ్యవర్తిత్వంతో ఈ డీల్​కు రష్యా సమ్మతించింది. అయితే, ఇటీవల క్రిమియాలోని రష్యా నావల్​ బేస్​ పై డ్రోన్ దాడి జరగడంతో ఈ డీల్​ను తాత్కాలికంగా సస్పెండ్​ చేస్తున్నట్లు పుతిన్​ ప్రకటించారు. అయితే, ఎక్స్​పోర్ట్​ డీల్​ను సస్పెండ్​ చేయడంపై యూఎన్​తో పాటు అమెరికా కూడా రష్యాను తప్పుబడుతున్నాయి. ఉక్రెయిన్​ నుంచి ఎగుమతులు నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇబ్బంది పడతాయని గుర్తుచేశాయి. పేద దేశాల్లో ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేశాయి. తాజాగా ఈ విషయంపై రష్యా ప్రెసిడెంట్​ పుతిన్​ స్పందించారు. ఉక్రెయిన్​ ఎక్స్​పోర్ట్​ డీల్​ ను పునరుద్దరిస్తున్నట్లు బుధవారం​ ప్రకటించారు.