సిద్దిపేట జిల్లాలో వెయ్యేండ్ల నాటి జైన శిల్పాలు

సిద్దిపేట జిల్లాలో వెయ్యేండ్ల నాటి జైన శిల్పాలు

హైదరాబాద్, వెలుగు:  సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్​ మండలంలోని కొండపోచమ్మ ఆలయ ప్రాంతానికి వెయ్యేండ్ల చరిత్ర ఉన్నట్లు పురావస్తు ఆధారాలు దొరికాయి. ఆలయం ప్రాంతంలోని నాగపూరి ఏనె గుట్టపై ముండ్ల పొదల్లో వెయ్యేండ్ల కిందటి జైన శిల్పాలు బయటపడ్డాయి. కొత్త తెలంగాణ బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, కానోజు కిరణ్ ఈ గుట్టపైన ముండ్ల కంపలను తొలగిస్తుండగా రెండు విగ్రహాలు దొరికాయి. ఆ విగ్రహాలను పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఒక విగ్రహం జైన తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడిదని, మరొకటి ఆదినాథుడు, నేమినాథుడు, పార్శ్వనాథుడు, మహావీరుల బొమ్మలను నాలుగు వైపులా చెక్కిన జైన చాముఖ శిల్పమని తెలిపారు. వర్ధమాన మహావీరుడు ధ్యానముద్రలో కూర్చుని ఉన్న నాలుగున్నర అడుగుల విగ్రహానికి తల, చేతులు విరిగిపోయాయని చెప్పారు. శిల్ప కళా రీతిని బట్టి అది,  క్రీస్తుశకం 11వ శతాబ్దానికి చెందిన కల్యాణి చాళుక్యుల కాలం నాటి చాముఖ శిల్పమన్నారు. నాగపురి గుట్టపైన రాతి పునాదులపై ఇటుక రాతితో నిర్మించిన జైన బసది ఉందని శివనాగిరెడ్డి తెలిపారు. నిధుల వేటగాళ్లు, జైన బసది తవ్వి ఆనవాళ్లు లేకుండా చేశారని చెప్పారు. కొండ పోచమ్మ గ్రామ చరిత్రను వెయ్యేండ్లకు తీసుకెళ్లిన ఈ జైన విగ్రహాలను భద్రపరచాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఇతర సభ్యులు మహమ్మద్ నసీరుద్దీన్, కొరవి గోపాల్ పాల్గొన్నారు.