- మహిళలు, యువతే మాకు బలం
- బిహార్‌లో ఇక ఎప్పటికీ జంగల్రాజ్ రాదు
- నెక్స్ట్ బెంగాల్లోనూ విజయం మాదే.. అక్కడా జంగల్‌రాజ్‌ను కూకటివేళ్లతో పెకిలించేస్తాం
- కుటుంబ పాలన దేశానికి ముప్పు
- కాంగ్రెస్ పరాన్న జీవి.. దానితో జాగ్రత్త
- అదొక ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్‌లా మారిందని వ్యాఖ్య
- బీజేపీ హెడ్ఆఫీస్లో సంబురాలు
న్యూఢిల్లీ: బిహార్ ప్రజలు ఎన్డీయేకు అద్భుత విజయం అందించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓటర్లంతా వికసిత్ భారత్‌కు ఓటేశారని తెలిపారు. ‘ఫిర్ ఏక్ బార్.. ఎన్డీయే సర్కార్’ అంటూ నినదిస్తూ మరోసారి అభివృద్ధికే పట్టం కట్టారన్నారు. ఈమేరకు ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో మోదీ మాట్లాడారు.
‘‘ఎన్డీయేకు మహిళలు బలమైన మద్దతు ఇచ్చారు. ఈ విజయం బిహార్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మాలో ఉత్సాహాన్ని నింపింది. కొన్ని పార్టీలు ‘ముస్లిం – యాదవ్ (ఎం-వై)’ అనే బుజ్జగింపు సూత్రాన్ని అమలు చేశాయి. మేము ‘మహిళలు– యువత (ఎం-వై)’అనే ఫార్ములాను అమలుచేశాం. బిహార్ యువత కలలు నెరవేర్చడానికి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్డీయే ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తుంది’’అని మోదీ అన్నారు.
రాజకీయ గెలుపు కాదు.. పేదల విజయం
బిహార్ జంగిల్ రాజ్ అన్నప్పుడు ఆర్జేడీ నుంచి ఎలాంటి వ్యతిరేకతాలేదని ప్రధాని మోదీ అన్నారు. ఇక బిహార్‌లో జంగిల్ రాజ్ ఎప్పటికీ తిరిగిరాదని తెలిపారు. జంగిల్‌రాజ్‌లో ప్రజలు దోపిడీ, అక్రమాలు, హింసకు గురయ్యారని గుర్తుచేశారు. ‘‘ఈ విజయం కేవలం రాజకీయం గెలుపు కాదు. పేదలు, దళితులు, అణగారిన వర్గాలు, మహిళలకు సామాజిక న్యాయం, సేవ చేయాలనే సంకల్పానికి లభించిన మద్దతు. ఈ ఫలితాలు కుటుంబ పాలన నడుపుతున్న పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. బిహార్.. యువతకు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు అందించి ప్రపంచానికి తన శక్తిని నిరూపించుకుంటుంది’’ అని మోదీ పేర్కొన్నారు.
ఓటు చోరీతో ఈసీ ప్రతిష్టను దిగజార్చారు
కాంగ్రెస్ ఒక పరాన్నజీవి అని, ఇతర పార్టీలపై ఆధారపడి కాలం వెల్లదీస్తుంటుందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్‌కు దేశం పట్ల పాజిటివ్ విజన్ లేదని, అదొక ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్ (ఎంఎంసీ)లా మారిందన్నారు. ఓట్ చోరీ అంటూ ఈసీ ప్రతిష్టను దిగజార్చిందని విమర్శించారు. మతం, కులం ప్రాతిపదికన ప్రజలను విడదీసింది. కాంగ్రెస్ త్వరలో రెండుగా విడిపోతుంది.
సామాజిక న్యాయమే గెలిపించింది
గుడ్ గవర్నెన్స్, డెవలప్మెంట్, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయమే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా అద్భుతమైన తీర్పు చెప్పారని పేర్కొన్నారు.
మేం ప్రజలకు సేవకులం
గంగానది బిహార్ నుంచి బెంగాల్‌కు ప్రవహిస్తుందని, బెంగాల్‌లో బీజేపీ విజయానికి బిహార్ గెలుపుతో లైన్ క్లియర్ అయిందని మోదీ అన్నారు. త్వరలో బెంగాల్లోనూ జంగిల్ రాజ్‌ను పారదోలతామని చెప్పారు. ‘‘నితీశ్ నాయకత్వంలో బిహార్‌లో గుడ్ గవర్నెన్స్ అందించిన విధానాన్ని ప్రజలు విశ్వసించారు. ఇది అభివృద్ధికి లభించిన విజయం.
మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం. రాష్ట్ర ప్రజలు రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొని ఎన్డీయేకు ఘన విజయం అందించా రు. ఈ విజయంతో ఈసీపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. ఒకప్పుడు బిహార్‌లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా, ధైర్యంగా వచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొన్నారు’’ అని మోదీ అన్నారు.
మోదీకి, మిత్రపక్షాలకు ఓటర్లకు, థ్యాంక్స్
అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే మాకు మంచి మెజారిటీ ఇచ్చారు. అందుకు రాష్ట్రంలోని ఓటర్లందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మద్దతుకు కూడా నేను సెల్యూట్ చేస్తున్నా. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పూర్తి ఐక్యత చూపింది. చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్, ఉపేంద్ర కుష్వాహాలతో పాటు ఎన్‌డీయే మిత్రపక్షాలన్నింటికీ థ్యాంక్స్= బిహార్ సీఎం నితీశ్ కుమార్
-
