వాడిన కమలం.. జూబ్లీహిల్స్ బైపోల్లోడిపాజిట్ గల్లంతు

 వాడిన కమలం.. జూబ్లీహిల్స్ బైపోల్లోడిపాజిట్  గల్లంతు
  • నేతల మధ్య సమన్వయలోపమే కారణమంటున్న కేడర్ 

హైదరాబాద్, వెలుగు: బీజేపీకి జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి షాక్  ఇచ్చారు. త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో పట్టు పెంచుకోవాలని భావించిన ఆ పార్టీకి డిపాజిట్ లేకుండా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా ఈసారి తక్కువ ఓట్లు రావడంతో ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో నైరాశ్యం అలుముకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ తరపున గతంలో పోటీచేసి ఓటమిపాలైన లంకల దీపక్ రెడ్డికే ఈసారి కూడా ఆ పార్టీ టికెట్​ ఇచ్చి బరిలో దింపింది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అభ్యర్థికి 25,866  (14.11 శాతం) ఓట్లు వచ్చాయి. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ సెగ్మెంట్​లో కాంగ్రెస్  తర్వాత బీజేపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలో 17,061 (8.76 శాతం) ఓట్లకే కమలం పరిమితమైంది.

 అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లను గెలిచిన బీజేపీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో విజయం సాధించింది. తర్వాతి కొద్ది నెలల్లోనే రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్  స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా.. ఒక టీచర్, మరో గ్రాడ్యుయేట్  స్థానంలో గెలిచింది. దీంతో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే  అంటూ బీజేపీ నేతలు చెప్పుకొన్నారు. తర్వాత హైదరాబాద్  లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా పోటీచేసి ఓటమి పాలైంది. తాజాగా జూబ్లీహిల్స్  బైపోల్ లోనూ ఆ పార్టీ అభ్యర్థి భారీ పరాజయం చవిచూశారు. ఇది కార్యకర్తల్లో తీవ్ర అయోమయానికి గురిచేసింది. కనీసం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఇప్పుడు రాకపోవడంతో వారిలో గందరగోళం మొదలైంది. అయితే, దాన్ని కవర్  చేసేందుకు తమకు అక్కడ బలం లేదంటూ బీజేపీ నేతలు కొత్త ప్రచారం షురూ చేశారు.

పనిచేయని బండి పోలరైజేషన్

జూబ్లీహిల్స్​ ఫలితంపై బీజేపీలో అంతర్మథనం మొద లైంది. లోపం ఎక్కడ జరిగింది? బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోకల్ ఎంపీ కావడం, అభ్యర్థి ఎంపిక మొదలు, ప్రచార బాధ్యతలను ఆయనే చేపట్టడంతో ఓటమికి కూడా ఆయనే బాధ్యత వహించాలని  పలువురు నేత లు అభిప్రాయపడుతున్నారు. కానీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై  బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొదటి నుంచి పెద్దగా ఆసక్తి చూపలేదనే వాదనలున్నాయి. నామి నేషన్  గడువు ముగిసే ముందు వరకు అభ్యర్థిని ఫైన ల్  చేయకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్  విస్తృత ప్రచారం చేస్తుండగా... బీజేపీ అభ్యర్థి ఎంపికలోనే తలమునకలు కావడంతో కార్యకర్తలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

స్టార్  క్యాంపెయినర్లలో చాలా మంది ఇటువైపు కన్నెత్తి చూడలేదు. వారిని రప్పించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా ఆసక్తి చూపలేదనే వాదనలున్నాయి. మరోవైపు ప్రచార గడువు ముగిసే మూడు రోజుల ముందు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్  ఎంట్రీ ఇచ్చి.. ఓట్ల పోలరైజేషన్ కు తీవ్రంగా ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం అన్నీ తానై వ్యవహరించింది. కానీ, కీలకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను మాత్రం నిర్లక్ష్యం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్​కు అవయవదానం చేయడానికే బీజేపీ ఆత్మహత్య చేసుకున్నదంటూ సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే ఆరోపించారు. ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్​ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్​ కూడా.. బీజేపీ అగ్రనేతలు కిషన్​రెడ్డి, బండి సంజయ్, రాంచందర్ రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.