
- ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న ఎంవీఐలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రవాణా శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌లోకి కొత్తగా 102 మంది మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ)లు రానున్నారు. ఆరు నెలల కింద వీరిని నియమించగా, ప్రస్తుతం శిక్షణ కూడా పూర్తయింది. త్వరలోనే వీరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. దీంతో ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఈ వింగ్ మరింత పటిష్టం కానుంది.
ముఖ్యంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో, వాటి స్థానంలో ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిఘాను కట్టుదిట్టం చేయనుంది. అంతర్రాష్ట్ర వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన సందర్భంలో ఇకపై పటిష్ట నిఘాను పెంచనున్నారు. సరుకు పర్మిట్లు, వాహన అనుమతి, హైవేలపై వాహనాల తనిఖీలు, పొల్యూషన్, లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ వంటి వాటి విషయంలో ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే జరిమానా విధించడంపై ఈ టీం పనిచేయనుంది.
ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాల్లోనే ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం అవసరం రవాణా శాఖకు బాగా పెరిగింది. అందుకే ఈ 102 మంది కొత్త ఏఎంవీఐలలో దాదాపు 70 శాతం మందిని ఇక్కడే వినియోగించనున్నారు. మిగతా 30 శాతం ఉద్యోగులను ఇతర జిల్లాలకు పంపించనున్నారు.