
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 103 ఏళ్ల బామ్మ ఆస్పత్రిలోనే చిల్డ్ బీర్ కొట్టి సెలబ్రేట్ చేసుకుంది. అమెరికాలోని మసాచూసెట్స్ నగరానికి చెందిన స్టెజ్నా అనే వృద్ధురాలు మే నెల తొలి వారంలో కరోనాతో ఆస్పత్రిలో చేరింది. ఒక దశలో పరిస్థితి విషమించి చనిపోతుందనుకున్న ఆమె.. కరోనాను జయించింది. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆమెకు చిల్డ్ బీర్ అందించారని అమెరికాకు చెందిన వార్త పత్రిక యూఎస్ టుడే ప్రచురించింది. ఈ నెల తొలి వారంలో జ్వరంతో ఆస్పత్రిలో చేరిందని స్టెజ్నా మనవరాలు షెల్లీ చెప్పింది. అయితే అనుమానంతో ఆమెను ఐసోలేషన్ వార్డు తరలించి టెస్టు చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. ఎప్పుడూ చాలా హుషారుగా ఉండే తన బామ్మ ఆరోగ్యం విషమించిందని, ఒక దశలో ఆమె మళ్లీ బతకడం కష్టమని డాక్టర్లు అన్నారని షెల్లీ చెప్పింది. అయితే అదృష్టవశాత్తు ఆమె పూర్తిగా కోలుకుందని తెలిపింది. అప్పటి వరకు డల్ గా ఉన్న హుషారుగా హాస్పిటల్ స్టాఫ్ సహకారంతో బడ్ లైట్ బీరు తాగిందని యూఎస్ టుడే పత్రికకు షెల్లీ చెప్పింది. 103 ఏళ్ల వయసులో కరోనా మహమ్మారిని జయించిన స్టెజ్నా భర్త టెడ్డీ 82 ఏళ్ల వయసులోనే 1992లో మరణించాడు.