మహారాష్ట్రలో మిరాకిల్: అంత్యక్రియలు నిర్వహిస్తుండగా లేచికూర్చున్న 103 ఏండ్ల వృద్ధురాలు

మహారాష్ట్రలో మిరాకిల్: అంత్యక్రియలు నిర్వహిస్తుండగా లేచికూర్చున్న 103 ఏండ్ల వృద్ధురాలు

నాగ్‌‌పూర్‌‌‌‌: చనిపోయిందని 103 ఏండ్ల బామ్మ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా.. ఆఖరి క్షణంలో ఆమె జీవం తిరిగి వచ్చింది. వెంటనే డాక్టర్‌‌‌‌ను పిలిపించి చూపించగా.. పెద్దావిడ బతికే ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్‌‌‌‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఈ ఘటన సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ అయింది.

ఆఖరి క్షణంలో ఒంట్లో కదలికలు.. 

రామ్‌‌టెక్‌‌ తాలూకా చార్‌‌‌‌గావ్‌‌ గ్రామానికి చెందిన సావ్‌‌జీ సాఖరే(103)కు సోమవారం సాయంత్రం నుంచి ఒంట్లో చలనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె చనిపోయిందని భావించారు. బంధుమిత్రులందరికీ విషయం తెలియజేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సంప్రదాయాలు పూర్తిచేసి ఆమెను పాడె మీద ఉంచేందుకు తీసుకెళ్తుండగా పెద్దావిడ పాదాలను కదిలించింది. 

ఇది గమనించిన ఆమె మనవడు.. వెంటనే డాక్టర్‌‌‌‌ను పిలిపించారు. టెస్టులు చేసిన డాక్టర్‌‌‌‌.. సావ్‌‌జీ బతికే ఉందని చికిత్స చేశాడు. కాసేపటికి పెద్దావిడ కోలుకొని లేవడంతో అప్పటివరకు చేసిన ఏర్పాట్లన్నింటినీ తొలగించారు. అదేరోజు బామ్మ పుట్టిన రోజు కూడా కావడంతో బంధుమిత్రుల సమక్షంలో ఆమెతో కేక్‌‌ కట్‌‌ చేయించి సంబురాలు చేసుకున్నారు. మరణించిన వృద్ధురాలు బతికిందనే వార్త విని.. వందలాదిమంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆమెను చూసేందుకు తరలివచ్చారు.