డీజిల్ లేక ఆగిపోయిన 108 అంబులెన్స్

డీజిల్ లేక ఆగిపోయిన 108 అంబులెన్స్

అత్యవసర వైద్య సేవలందించే 108 అంబులెన్స్​లు డీజిల్​లేక నిలిచిపోతున్నాయి. యాచారం మండలానికి చెందిన వాహనం కొద్దిరోజులు ఆగిపోతే వేరేచోట నుంచి డీజిల్​పోయించడంతో గురువారం కదిలింది. నాగార్జున్​సాగర్​రోడ్డు, విజయవాడ రోడ్డు, ఔటర్​రింగ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏరియాల్లో 108 వెహికల్​అందుబాటులో ఉండాల్సిందే. కానీ డీజిల్​కొరతతో వాహనాలు షెడ్​నుంచి కదలడం లేదు. దాంతో ప్రమాదాలబారిన పడ్డవారు ప్రైవేటు అంబులెన్స్​లను ఆశ్రయించాల్సి వస్తోంది. గుండెనొప్పిలాంటి సమస్య వస్తే 108 లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు మాట్లాడి దవాఖానాకు తరలించే లోపే ప్రాణాలు పోయే ప్రమాదముందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 108 అంబులెన్స్​లకు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో బిల్లులు రావాల్సి ఉంది. ఎంవోయూ గడువు ముగిసిందనే కారణాలతో బకాయిలు చెల్లించడం లేదని తెలుస్తోంది. దాంతో వాహనాలకు డీజిల్​సమస్య తలెత్తుతోంది. అంతేకాకుండా జీవీకే- ఈఎంఆర్ఐ సంస్థలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో కూడా ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం.

బడ్జెట్ లేకపోవడంతో….

అంబులెన్స్ వాహనాల నిర్వహణను జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 108 అంబులెన్స్​వాహనాలు 22 ఉండగా ఇంధనం బకాయిలు రూ.15లక్షలు, మేడ్చల్​జిల్లాలో 15 వాహనాలకు రూ.9 లక్షల బకాయిలున్నట్టు సమాచారం. వీటికి డీజిల్​బకాయిలు ప్రతినెలా చెల్లింపులు జరగాల్సి ఉండగా 45రోజుల నుండి పెండింగ్​లో పెట్టినట్టు సమాచారం. దాదాపు రూ. 25 లక్షలకు పైగా బకాయిలు పేరుకుపోయినట్టు తెలుస్తోంది. దీంతో పెట్రోల్​పంపుల నిర్వాహకులు వాహనాలకు డీజిల్​పోయడానికి వెనుకాడుతున్నారు. కొందరు డబ్బులు చెల్లిస్తేనే డీజిల్ పోస్తామని లేకుంటే పోసేది లేదని కరాఖండిగా చెబుతున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల పెట్రోల్​పంపు యజమానులతో జీవీకే-ఈఎంఆర్ఐ ప్రతినిధులు మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నా, అంతటా సాధ్యంకావడం లేదు. దీంతో ప్రస్తుతం మూడు వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంకొన్ని చోట్లకూడా డీజిల్ బిల్లులు చెల్లించక 108 వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఉంది.