తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలో గంజాయి వనం గుట్టురట్టయింది. పంట పొలాల మధ్య సాగు చేస్తున్న బర్వాద్ గ్రామంలోని ఒక రైతు పొలం నుంచి 108 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. 11 లక్షల రూపాయల విలువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బర్వాద్ గ్రామం పెంటయ్య అనే రైతు పొలంలో సాగు చేస్తున్న 108 గంజాయి మొక్కలను తాండూర్ ఎక్సైజ్ శాఖ దాడులు జరిపి స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇద్దరి ప్రమేయం ఉండగా.. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు.. మరొకరు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పత్తి చేనులో గంజాయి మొక్కులు సాగు చేయగా పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు.
Also Read : వనపర్తి జిల్లాలోని డీ ఫాల్ట్ మిల్లుల్లోని వడ్లు తరలించాలి
ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. కెరిమెరి మండలం పరందోళి పంచాయతీ పరిధి కోటా గ్రామానికి చెందిన గైక్వాడ్ శివాజీ తన పత్తి చేనులో 28 గంజాయి మొక్కలను సాగు చేశాడు. వాటిపై సమాచారం అందడంతో ఎస్ఐ మధుకర్ సిబ్బందితో వెళ్లి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువు సుమారు రూ.2.80 లక్షలు ఉంటుంది. గంజాయి సాగు చేసినా, తాగినా నేరమని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

