వట్టిగా పానం తీసికుంటివా బిడ్డా

వట్టిగా పానం తీసికుంటివా బిడ్డా
  • పరీక్షలో ఫెయిల్ అవుతానని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
  • సోమవారం నాటి ఫలితాల్లో 9.5 జీపీఏతో ఉత్తీర్ణత
  • కుటుంబానికి తీరని శోకం మిగిల్చిన ‘భయం’

కాగజ్​నగర్​, వెలుగు:పాఠశాలలో బాగా చదివింది. తరగతి గదిలో తోటి విద్యార్థుల్లో ఆమె అన్నింటా పోటీ పడేది. ఈ క్రమంలో పరీక్షలు కూడా బాగానే రాసింది. పరీక్ష ఫలితాలు మరో వారం రోజుల్లో వస్తున్నాయన్న తరుణంలో  ఎలా ఆలోచించిందో తెలియదు కాని ఫెయిల్​ అవుతానేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది.  సోమవారం వెలువడ్డ వార్షిక ఫలితాల్లో ఆ విద్యార్థిని 9.5 జీపీఏ సాధించి ప్రథమ శ్రేణిలో పాస్​ కావడం ఆ కుటుంబానికి మరింత బాధ కలిగించింది.

కొమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలోని మహ్మద్​ అన్వర్​, అంజుమ్​కు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు . పెద్ద అబ్బాయి అనంత్​ హైదరాబాద్​లో డిగ్రీ చదువుతుండగా రెండో అబ్బాయి నవ్​మన్​ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్​ చదువుతున్నాడు. కూతురు ఫిజాఫిర్దోస్​ పట్టణంలోని వీఐపీ పాఠశాలలో పదో తరగతి ఇటీవల పూర్తి చేసింది. ఈ క్రమంలో వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడేందుకు వారం రోజుల ముందు ఈ నెల 7వ తేదీన పరీక్షల్లో ఫెయిల్​ అవుతాననే భయంతో ఇంట్లోని బాత్రూంలో ఒంటిపై కిరోసిన్​ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది.   పట్టణ పోలీస్​స్టేషన్​లో కేసు కూడా నమోదు అయింది. సోమవారం వెలువడ్డ ఫలితాల్లో ఫిర్దోస్​ 9.5 జీపీఏ సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్​సింగ్​ తెలిపారు. క్షణికావేశంలో విద్యార్థి చేసుకున్న ఆత్మహత్య  చాలా బాధకలిగించిందన్నారు.